పవర్‌లిఫ్టింగ్ పోటీలు షురూ
సనత్‌నగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఓపెన్ స్టేట్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సనత్‌నగర్ వాల్మీకి వ్యాయామశాలలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 59 కిలోల కేటగిరీ నుంచి 110 కిలోల కేటగిరీ వరకు మొత్తం 13 ఈవెంట్లలో పోటీలు జరిగాయి. తెలంగాణ జిల్లాల నుంచి పలువురు పవర్‌లిఫ్టర్స్ పాల్గొని తమ సత్తా చాటుకున్నారు. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సనత్‌నగర్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ వెల్లాల రామ్మోహన్, బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి భవర్‌లాల్‌వర్మ, సుభాష్‌నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భోగి బాలరాజ్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి వ్యాయామశాల పవర్‌లిప్టింగ్‌లో శిక్షణనిస్తూ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ప్రతిభవున్న వారిని ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పారు. ఎందరో ప్రతిభావంతులైన పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఓంప్రకాశ్ బిడ్లాన్ను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు కొలన్ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.