‘ఓపెన్’ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
- ‘పది’లో 56.52 శాతం, ఇంటర్లో 43.92 శాతం ఉత్తీర్ణత
అనంతపురం ఎడ్యుకేషన్ : ఓపెన్ స్కూల్(సార్వత్రిక విద్యా పీఠం) ద్వారా అక్టోబర్‌లో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 506 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 286 మంది(56.52శాతం), 1,061 మంది ఇంటర్ పరీక్షలు రాయగా 466(43.92 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ శామ్యూల్, ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
జవాబుపత్రం, రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు పదో తరగతి విద్యార్థులైతే రూ.100, ఇంటర్ విద్యార్థులైతే రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీవెరిఫికేషన్ (జవాబుపత్రం జిరాక్స్)కైతే పదో తరగతి విద్యార్థులైనా, ఇంటర్వాళ్లయినా ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని, మీసేవా, ఏపీ ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు.