సఫారీలు గెలిచారు
► అఫ్ఘానిస్తాన్‌పై దక్షిణాఫ్రికా విజయం
► రాణించిన డివిలియర్స్ టి20 ప్రపంచకప్
ముంబై: టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా ఓటమిపాలైన దక్షిణాఫ్రికా... రెండో మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌పై కూడా భారీ స్కోరు చేసి తడబడినా గెలిచింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్ఘానిస్తాన్ ఓ దశలో చెలరేగినా సఫారీ బౌలర్లు చివర్లో కట్టడి చేయగలిగారు. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 37 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేశారు. డివిలియర్స్ (29 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
ఓపెనర్ ఆమ్లా (5) విఫలమైనా... డికాక్ (31 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డు ప్లెసిస్ (27 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. తర్వాత డివిలియర్స్ సిక్సర్ల జోరు చూపెట్టాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా... రషీద్ వేసిన 17వ ఓవర్లో నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 29 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో మరో సిక్సర్ బాది అవుట్‌కాగా... డుమిని (20 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్‌కు 76 పరుగులు జత చేశాడు. చివర్లో మిల్లర్ (8 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడటంతో ప్రొటీస్ స్కోరు 200 దాటింది. అఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ మహ్మద్ షెహజాద్ (19 బంతుల్లో 44; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు.
తొలి ఓవర్లో ఓ సిక్స్, ఫోర్‌తో పాటు, అబాట్ వేసిన రెండో ఓవర్లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. దీంతో రెండు ఓవర్లలో అఫ్ఘాన్ స్కోరు 33 పరుగులకు చేరింది. మూడో ఓవర్లో 14 పరుగులు రాబట్టిన షెహజాద్.. నాలుగో ఓవర్లో అనూహ్యంగా స్టంపౌటయ్యాడు. దీంతో నూర్ అలీ జద్రాన్ (24 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అస్గర్ (7) విఫలమైనా... గుల్బాదిన్ (18 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా స్పందించడంతో అఫ్ఘానిస్తాన్ తొలి 10 ఓవర్లలో 2 వికెట్లకు 103 పరుగులు చేసింది. తర్వాత గుల్బాదిన్, నూర్ అలీలు వరుస ఓవర్లలో అవుట్‌కావడం ఇన్నింగ్స్‌పై ప్రభావం చూపింది. మిడిలార్డర్లో సైమూల్లా షెన్వారి (14 బంతుల్లో 25; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమవడంతో... 67 పరుగుల తేడాలో ఏడు వికెట్లు చేజార్చుకుంది. 4 వికెట్లు తీసిన మోరిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) షెహజాద్ (బి) హమ్జా 45; ఆమ్లా (సి) అస్గర్ (బి) షాపూర్ 5; డు ప్లెసిస్ రనౌట్ 41; డివిలియర్స్ (సి) నూర్ అలీ (బి) నబీ 64; డుమిని నాటౌట్ 29; మిల్లర్ (సి) గుల్బాదిన్ (బి) దౌలత్ 19; వీస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 209.
వికెట్ల పతనం: 1-25; 2-90; 3-97; 4-173; 5-203.
బౌలింగ్: అమిర్ హమ్జా 3-0-25-1; దౌలత్ 3-0-46-1; షాపూర్ 3-0-28-1; నబీ 4-0-35-1; రషీద్ ఖాన్ 4-0-51-0; షైన్వారి 3-0-22-0.
అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: షెహజాద్ (బి) మోరిస్ 44; నూర్ అలీ (స్టంప్) డికాక్ (బి) తాహిర్ 25; అస్గర్ (సి) డికాక్ (బి) మోరిస్ 7; గుల్బాదిన్ నబీ (సి) డికాక్ (బి) అబాట్ 26; మహ్మద్ నబీ (సి) డివిలియర్స్ (బి) తాహిర్ 11; సైమూల్లా షెన్వారి (సి) వీస్ (బి) అబాట్ 25; నజీబుల్లా జద్రాన్ (సి) డికాక్ (బి) రబడ 12; రషీద్ ఖాన్ (బి) మోరిస్ 11; దౌలత్ జద్రాన్ (బి) మోరిస్ 0; అమిర్ హమ్జా నాటౌట్ 3; షాపూర్ (బి) రజడ 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్) 172.
వికెట్ల పతనం: 1-52; 2-60; 3-105; 4-109; 5-140; 6-156; 7-156; 8-167; 9-169; 10-172.
బౌలింగ్: రబడ 4-0-37-2; అబాట్ 4-0-36-2; మోరిస్ 4-0-27-4; తాహిర్ 4-0-24-2; వీస్ 4-0-47-0.