ప్రత్యేక ఫీచర్లతో ఒపెరా బ్రౌజర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లోని నెట్ యూజర్ల వాడకానికి అనుగుణంగా త్వరలో తమ బ్రౌజర్లో వీపీఎన్ తదితర ప్రత్యేక ఫీచర్లు ప్రవేశపెట్టనున్నట్లు ఒపెరా సంస్థ డిప్యుటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బ్రూస్ లాసన్ తెలిపారు. ఒపెరా మినీ మొబైల్ బ్రౌజర్లో తాము ఉపయోగిస్తున్న టెక్నాలజీ.. డేటాను 90 శాతం మేర కుదించేస్తుందని వివరించారు. ఫలితంగా దేశీ యూజర్లకు గత ఏడాది వ్యవధిలో సుమారు 36 వేల టెరాబైట్ల డేటా, రూ. 690 కోట్ల మేర డేటా చార్జీలు ఆదా అయ్యాయని గురువారమిక్కడ లాసన్ తెలిపారు.
ప్రస్తుతం తమ బ్రౌజర్‌కు భారత్‌లో సుమారు 5 కోట్ల మంది పైచిలుకు యూజర్లు ఉన్నారని చెప్పారు. బ్రౌజర్లో తెలుగు సహా 13 భాషల్లో తోడ్పాటు అందిస్తున్నామన్నారు. దేశీయంగా మినీ యూజర్లలో సింహభాగం సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, వార్తల సంబంధిత సైట్లను సందర్శిస్తున్నట్లు లాసన్ చెప్పారు. అధిక డేటా చార్జీలు, కవరేజీ నాణ్యత మోస్తరుగా ఉండటం వంటి అంశాల వల్ల భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం తక్కువగానే ఉందని, ఇప్పుడిప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతోందని ఆయన తెలిపారు.