operation attraction
-
కర్ణాటక సంకీర్ణంలో టెన్షన్.. టెన్షన్
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏడాది ముచ్చటే కానుందా? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో బీజేపీ ‘ఆపరేషన్ కమల’ను ప్రారంభించనుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సంకేతాలు ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినట్లు మొత్తం 28 లోక్‌సభ సీట్లలో బీజేపీ 18 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్(77), జేడీఎస్(37) పార్టీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే యడ్యూరప్ప ప్రభుత్వం అసెంబ్లీలో 111 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు బలనిరూపణ చేసుకోలేకపోయింది. దీంతో ఓ బీఎస్పీ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో జేడీఎస్–కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. సొంత గూటిలో అసమ్మతి సెగలు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు దక్కని అసమ్మతి నేతలను బీజేపీ లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారేసరికి కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ జోస్యం చెప్పారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అన్నీ సిద్ధమయ్యాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇందుకు తగ్గట్లు కాంగ్రెస్‌లోనూ అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. కేపీసీసీ చీఫ్ గుండూరావు ఫ్లాప్ షో అనీ, సిద్దరామయ్య ఓ మూర్ఖుడనీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ బఫూన్ అని ఆ పార్టీ సీనియర్ నేత రోషన్ బేగ్ విరుచుకుపడ్డారు. వీరివల్ల కర్ణాటకలో కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయిందని ఘాటుగా విమర్శించారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సుధాకర్ స్పందిస్తూ ఈవీఎంలపై పార్టీ హైకమాండ్ పోరాటాన్నే తప్పుపట్టారు. కర్ణాటకలో సంకీర్ణ కూటమి బీటలు వారుతోందని చెప్పేందుకు ఇవన్నీ సాక్ష్యాలేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రమేశ్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కమల’.. కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలీ ‘ఆపరేషన్ కమల’లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమైన రమేశ్, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అమలుచేయాల్సిన వ్యూహంపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే తనతో పాటు మహేశ్ కుమతిహళ్లి, భీమా నాయక్, జేఎన్ గణేశ్ సహా 22 మంది అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆయన షాకు వివరించినట్లు సమాచారం. గెలిచినఎంపీలతో మే 24న సమావేశం కావాలని యడ్యూరప్ప నిర్ణయించారు. మా ప్రభుత్వమే కొనసాగుతుంది: సీఎం కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందన్న వాదనల్ని సీఎం కుమారస్వామి తోసిపుచ్చారు. తన ప్రభుత్వం మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
మృత్యువును జయించిన కమాండర్
విశాఖ సిటీ: అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లో బ్ రేస్–2018లో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయం నుంచి బయటపడిన భారత నౌకా దళానికి చెందిన కమాండర్ అభిలాష్ టామీ ఎట్టకేలకు విశాఖ నగరానికి చేరుకున్నారు. ఆసియా ఖండం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏౖకైక అధికారి అభిలాష్ ఈ రేస్‌లో తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సెప్టెంబర్ 21న సాట్‌ఫోన్ ద్వారా సమాచారంఅందించారు. ఫ్రాన్స్‌లోని లెస్ సెబ్లెస్ పోర్టులో జూలై ఒకటో తేదీన ప్రారంభమైన గోల్డెన్ గ్లోబ్ రేస్ 2019 ఏప్రిల్‌లో ముగియనుంది. ఒంటిచేత్తో నాన్ స్టాప్‌గా ప్రపంచయానం చెయ్యడమే ఈ రేస్ ప్రత్యేకత. భారత నౌకాదళానికి చెం దిన కమాండర్ అభిలాష్ సెయిలింగ్‌లో అందె వేసిన చెయ్యి. 2012–13లో ఐఎన్ఎస్వీ మహదేయ్‌లో ఒంటరిగా ప్రపంచ వ్యాప్తంగా 53వేల నా టికల్ మైళ్లు ప్రయాణిం చారు. కీర్తి చ క్ర, మాక్ గ్రె గోర్, టెన్జింగ్ నార్గే సహా పలు పురస్కారాలు సొం తం చేసుకున్నారు. ఈ ఫీట్ సాధించిన నేపథ్యం లో గోల్డెన్ గ్లోబ్ రేస్‌కు ఎంపికయ్యారు. ఈ రేస్‌లో మేకిన్ ఇండియా నినాదాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా గోవాలోని అక్వేరియస్ షిప్‌యార్డులో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఐఎన్ఎస్వీ దురియా నౌకను వినియోగిస్తున్నారు. దక్షిణ హిందూ మహా సముద్రంలో పెర్త్‌కు 1500 నాటికల్ మైళ్ల దూరంలో, ఆస్ట్రేలియాకు 2,700 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో తాను తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు టామీ సందేశం అందించారు. తాను సొంతంగా కదలలేకపోతున్నాననీ, త్వరగా స్ట్రెచర్ పంపించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత టామీ నుంచి సమాచారం రాకపోవడంతో భారత నౌకాదళ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఫిషరీస్ నౌక వీరి గమనాన్ని కనుగొని నేవీకి సమాచారం అందించింది. సమాచారం అందుకున్న రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ షిప్ దురియా వద్దకు బయలుదేరింది. మరోవైపు భారత నౌకాదళం కూడా రెస్క్యూ బృందాన్ని పంపించింది. ఐఎన్ఎస్ సాత్పురాతో పాటు ఓ ఛేతక్ హెలికాఫ్టర్‌ను రెస్క్యూ కోసం పంపించి ఆపరేషన్ రక్షమ్ పేరుతో సహాయక చర్యలు ప్రారంభించారు. చివరకు టామీ బయలుదేరిన దురియా ఓడను సెప్టెంబర్ 28న కనుగొని నౌకాదళాధికారిని రక్షించారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత ఐఎన్ఎస్ సాత్పురాలోనే శనివారం నగరానికి చేరుకున్నారు. టామీని కలిసిన తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
పీడీసీసీబీ పీఠంపై ‘దేశం’ కన్ను
ఒంగోలు వన్‌టౌన్: ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (పీడీసీసీబీ) పీఠంపై తెలుగుదేశం పార్టీ కన్ను పడింది. ఎలాగైనా బ్యాంకు చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. వాస్తవానికి బ్యాంకు పాలకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లేకపోయినా అడ్డదారుల్లోనైనా కైవసం చేసుకుని బ్యాంకుపై పచ్చ జెండా ఎగురవేసేందుకు దేశం నాయకులు తహతహలాడుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ఇతర పార్టీల జెడ్పీటీసీ సభ్యులను లోబరుచుకున్న విధంగానే బ్యాంకు డెరైక్టర్లను కూడా తమ వైపునకు తిప్పుకునేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతోంది. బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబుపై అవిశ్వాసం పెట్టి దించేసి ఆ పదవిని లాక్కునేందుకు తెరచాటున ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీకి చెందిన ఇద్దరు బ్యాంకు డెరైక్టర్లు, బ్యాంకు చైర్మన్ పదవి తమకేనంటూ బ్యాంకు డెరైక్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పీడీసీసీ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు గతేడాది మేలో జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈదర మోహన్‌బాబు బ్యాంకు చైర్మన్‌గా, వైస్‌చైర్మన్ కండే శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఈదర మోహన్‌బాబు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని విభేదిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికి వారి గెలుపు కోసం కృషి చేశారు. అధికారికంగా టీడీపీలో చేరనప్పటికీ ఆ పార్టీ సానుభూతిపరునిగానే వ్యవహరిస్తున్నారు. సొసైటీలకు నిధుల కేటాయింపు విషయంలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అధ్యక్షులు అడిగిన మేరకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు. అవిశ్వాసానికి పావులు కదుపుతున్న నేతలు: ఈదర మోహన్‌బాబుపై అవిశ్వాసం ప్రకటించి ఆయనను పీడీసీసీబీ చైర్మన్ పదవి నుంచి దించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం సొసైటీ ఎన్నికలు జరిగినప్పుడే టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన ఒక డెరైక్టర్, అద్దంకి ప్రాంతానికి చెందిన మరో డెరైక్టరు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు అవసరమైన మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నులై ఉన్నారు. గతంలో చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన ఒక డెరైక్టర్ సుదీర్ఘకాలంగా సొసైటీ అధ్యక్షునిగా పనిచేస్తుండడంతో తనకున్న పరిచయాలను కూడా వినియోగించుకుని డెరైక్టర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు పాలకవర్గంలో మొత్తం 21 మంది డెరైక్టర్లుంటారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు బ్యాంకు డెరైక్టర్లలో 50 శాతం మందికి పైగా మద్దతు అవసరం. అంటే కనీసం 11 మంది డెరైక్టర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు పెట్టాలి. బ్యాంకు చైర్మన్‌పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ (ఆర్సీఎస్)కు వీరు వినతిపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం నలుగురు డెరైక్టర్లు ఆర్ సీఎస్ సమక్షంలో సంతకం చేసి అవిశ్వాస ప్రతిని ఆయనకు అందజేయాల్సి ఉంటుంది. అవిశ్వాసం నెగ్గేందుకు మొత్తం డెరైక్టర్లలో మూడింట రెండు వంతుల మంది మద్దతు తెలపాలి. అంటే కనీసం 14 మంది డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినప్పుడే అవిశ్వాసం నెగ్గుతుంది. బ్యాంకు పాలకవర్గంలో ప్రస్తుతమున్న సంఖ్యాబలం ప్రకారం చైర్మన్ ఈదర మోహన్‌బాబుకు 14 మంది డెరైక్టర్ల మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు వీరిలో కనీసం నలుగురు డెరైక్టర్లు ఆ ప్రతిపాదనపై సంతకం చేయాలి. ఏడుగురు డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు డెరైక్టర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అద్దంకి ప్రాంతానికి చెందిన బ్యాంకు డెరైక్టర్ తనకు మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి ఆశీస్సులున్నాయని చెప్పుకుంటూ డెరైక్టర్ల మద్దతును కూడగట్టే పనిలో ఉన్నారు. బ్యాంకు పాలకవర్గంలో చైర్మన్ తరువాత ముఖ్యస్థానంలో ఉన్న ఒక నేత కూడా సొసైటీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ బ్యాంకు చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన డెరైక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ డెరైక్టర్లను కూడగట్టేపనిలో ఉన్నారు. కొందరు డెరైక్టర్లతో ఇటీవల ఆయన సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సహకారం బ్యాంకు చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న నేతలకు కొందరు బ్యాంకు మేనేజర్లు, ఉద్యోగులు కూడా తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. కొందరు విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు కూడా డెరైక్టర్ల మద్దతును కూడగట్టే విషయంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తటస్థంగా ఉండగా మిగిలిన వారు మాత్రం బ్యాంకు చైర్మన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయారు. దీంతో బ్యాంకు పరిపాలనలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విషయాన్ని ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారు. అవిశ్వాస ప్రయత్నాలు నిజమే.. తనపై అవిశ్వాసం ప్రతిపాదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవమేనని, ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు ధ్రువీకరించారు.