అచ్చం ఎయిర్‌లిఫ్ట్ సినిమాలాగే..
అంతర్యుద్ధంతో నలిగిపోతున్న దక్షిణ సూడాన్ ప్రాంతంలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం నడుంకట్టింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి అచ్చం ‘ఎయిర్‌లిఫ్ట్’ సినిమాలో ఉన్నట్లే భారతీయ విమానాలు అక్కడకు వెళ్లాయి. అయితే ఈ విమానాలతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ కూడా వెళ్లడం విశేషం. సూడాన్ చేరుకున్న ఆయన.. అక్కడి ఆర్థికమంత్రి డెంగ్ అలోర్ కౌల్‌తో సమావేశమయ్యారు. భారత వైమానిక దళానికి చెందిన రెండు సి-17 గ్లోబ్ మాస్టర్ రకం విమానాలను అక్కడకు పంపారు.
వాటిలో అక్కడ చిక్కుకుపోయిన దాదాపు 300 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు. మొదటి విమానం ఇప్పటికే సూడాన్ రాజధాని జుబా నగరంలో ల్యాండ్ అయింది. దీనికి ‘ఆపరేషన్ సంకట్ మోచన్’ అని పేరు పెట్టారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక బృందంలో భాగంగా ప్రస్తుతం దక్షిణ సూడాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న భారతీయ సైనికులు కూడా అక్కడున్న ప్రవాస భారతీయులను ఖాళీ చేయించడంలో సాయపడుతున్నారు. వాళ్లందరినీ జుబా విమానాశ్రయానికి తీసుకొచ్చి.. విమానాలు ఎక్కించారు.