2147 మంది అభ్యర్థులకు ఉద్యోగ కల్పన
గణపవరం (నాదెండ్ల): ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో యువతకు ఉద్యోగ కల్పనకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖా మాత్యులు నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని చుండి రంగనాయకులు ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం మెగా జాబ్‌మేళా ముగిసింది. రెండోరోజు స్థానికేతరులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 7 వేల మంది హాజరుకాగా, 1200 మంది ఎంపికయ్యారు. రెండ్రోజుల్లో కలిపి 52 బహుళజాతి కంపెనీల ద్వారా మొత్తం 2147 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జేఎన్టీయూ కాకినాడ వీసీ వీఎస్ఎస్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కాకినాడ వికాస ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఆరేళ్లలో పది జాబ్‌మేళాలు నిర్వహించి 17400 మందికి పైగా ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా స్వర్ణాం్ర«ధ ఫౌండేషన్ కృషి చేస్తుందని చెప్పారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడాది వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ భవిష్యత్తులో వికాస సంస్ధ అన్ని జిల్లాల్లో విస్తరించి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాల కల్పనకు పనిచేయాలని కోరారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. నియామకాల్లో పాల్గొన్న 52 కంపెనీల ప్రతినిధులను సత్కరించారు. జాబ్‌మేళాలో విధులు నిర్వహించిన నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐలు శోభన్‌బాబు, సురేష్‌బాబు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందిని కళాశాల యాజమాన్యం, స్వర్ణాంధ్ర ఫౌండేషన్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో వికాస పీడీ డాక్టర్ వీఎన్‌రావు, స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కార్యదర్శి పేర్ని వీరనారాయణ, కళాశాల సెక్రటరీ చుండి వేణుగోపాల్, అధ్యక్షుడు విజయసారధి, గ్రామ సర్పంచ్ పెనుమల జాన్‌బాబు, మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి, మార్కెట్‌యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, ఆర్డీవో జి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.