ఇద్దరు ప్రతిపక్ష నేతలను ఉరి తీశారు
ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ప్రతిపక్ష నాయకులను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరి తీసినట్టు ఓ మంత్రి తెలిపారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో యుద్ధ నేరాలకు పాల్పడినట్టు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష పెట్టాలని వారు అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి 12.45 గంటలకు వారిని ఉరి తీసినట్టు న్యాయశాఖ మంత్రి అనిసుల్ హఖ్ ఆదివారం మీడియాకు తెలిపారు.
యుద్ధ నేరాల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న సీనియర్ ప్రతిపక్ష నేతలు అలీ ఆషన్ మహమ్మద్ ముజాహిద్, సలాహుద్దీన్ ఖదర్ చౌదరీ తమకు క్షమాభిక్ష పెట్టాలని కోరినప్పటికీ.. ప్రభుత్వం తిరస్కరించింది. వీరి ఉరి నేపథ్యంలో ఢాకా కేంద్ర కారాగారం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతిపక్ష నాయకులను ఉరితీసిన వార్త తెలియడంతో ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ శ్రేణులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు.