'జేఎన్‌యూ సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధం'
ఢిల్లీ: పార్లమెంట్ సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. జేఎన్‌యూ సహా అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా విద్యార్థులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని వెంకయ్య నాయుడు విమర్శించారు. రాజకీయాల కోసం పార్లమెంట్‌ను వేదికగా చేసుకోవద్దని హితవు పలికారు. జేఎన్‌యూలో ప్రభుత్వం ఎలాంటి దాడులు చేయలేదన్నారు. జాతీయ భావాలు ఉన్న వీసీలను ఆర్ఎస్ఎస్ లాబీయులుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు.
ఇప్పటివరకు ఉన్న వామపక్ష వీసీలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. దేశద్రోహులకు సానుభూతి చూపొద్దని సూచించారు. డీఎన్యూ విద్యార్థి సంఘం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అందరూ సంయమనం పాటించాలన్నారు. చట్టాని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ సీట్లు పెంచాలనే ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని వెంకయ్య తెలిపారు. అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ 2019 కల్లా పూర్తవుతుందని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.