నేడు ఎంపీపీల ఎన్నిక
పాతగుంటూరు : మండల పరిషత్ అధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లాపరిషత్ సీఈవో సుబ్బారావు గురువారం తెలిపారు. ఎన్నికల విధి విధానాలను జిల్లాపరిషత్ కార్యాలయంలో ఆయన వెల్లడించారు.
ఉదయం 10 గంటలలోపు కో ఆప్షన్ సభ్యులకు, అధ్యక్ష, ఉపాధ్యక్ష బీఫారాలను ఆయా పార్టీల అధ్యక్షులు సమర్పించాలి.
11గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ జరుగుతుంది.అనంతరం అభ్యర్థుల పేర్లను నోటీసు బోర్డులో ఉంచుతారు. మధ్యాహ్మం ఒంటిగంటకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం, తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు.
సభ్యులు చేతులెత్తే పద్ధతిలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది.తర్వాత కో ఆప్షన్సభ్యులతోపాటు, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం.మధ్యాహ్నం 3గంటలకు సభ్యులు చేతులెత్తి పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
ఎన్నికైన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరంమండల పరిషత్ మొదటి సమావేశం నిర్వహిస్తారు. ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు ఐదేళ్లు పదవుల్లో కొనసాగుతారు.