కన్నీళ్లు మింగి..మింగి
పిల్లల ఆచూకీ కోసం తల్లిదండ్రులు గంపెడాశతో ఎదురుచూపులు
తమవారు వస్తారని భరోసా
‘హిమాచల్’ ఘటన జరిగి 8రోజులు పూర్తి
రహమత్‌నగర్,చైతన్యపురి: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన తమ పిల్లల ఆచూకీ ఇప్పటివరకు తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటన జరిగి 8రోజులు దాటినా కనీసం మృతదేహాలు కూడా లభ్యంకాకపోవడంతో వారి బాధ వర్ణానాతీతం.
రహమత్‌నగర్ బంగారు మైసమ్మ ప్రాంతానికి చెందిన జగదీశ్ ఆచూకీ లభ్యంకాకపోవడంతో చిన్ననాటి స్నేహితులు, సహచర విద్యార్థులు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ దుఖిఃస్తున్నారు. చదువులో అందరికంటే ముందుండే జగదీష్ తమతో గడిపిన మధురక్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తమ కొడుకు ఆచూకీ కనిపెట్టాలని ఇంటికొచ్చిన ప్రతిఒక్కర్నీ తల్లిదండ్రులు వేడుకుంటుండడం హృదయాలను కలిచివేస్తోంది.
మా అఖిల్ తిరిగొస్తాడు..: ‘మా కొడుకు తప్పక తిరిగొస్తాడు. ఎక్కడో ఉండి ఉంటాడు..ఆ నమ్మకం మాకుందని’ గల్లంతైన మాచర్ల అఖిల్ తల్లిదండ్రులు సుదర్శన్, సవితలు గంపెడాశతో చెప్పారు. దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీకాలనీకి చెందిన అఖిల్ హిమాచల్‌ప్రదేశ్ బియాస్‌నదిలో గల్లంతైన విష యం తెలిసిందే. తమ బిడ్డ ఎక్కడోచోట బతికే ఉం డవచ్చని..తప్పకవస్తాడని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల వత్తిడి వల్లే అక్కడి ప్రభుత్వం గాలింపు చర్యలు తీవ్రం చేసిందని చెప్పారు.
దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిల పరామర్శ: కాగా అఖిల్ తల్లి దండ్రులను సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ, బీజే పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు ఆదివారం పరామర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గల్లంతయిన వారి కోసం ఇప్పటికీ కేంద్ర బలగాలు శాస్త్రీయ పద్ధతులలో గాలింపు చేపడుతున్నారని ఆరోపించారు.
ప్రధాని మోడీతో మాట్లాడి గాలింపు చర్యలను మరింత వేగవంతం చేసేలా చూస్తామన్నారు. పర్యాటక కేంద్రం, ప్రమాదం జరిగే అవకా శం ఉన్న ప్రదేశంలో కనీసం హెచ్చరికబోర్డులు ఏ ర్పాటు చేయకపోవడం దారుణమని వాపోయారు.
కొవ్వొత్తులతో నివాళి
ఉస్మానియాయూనివర్సిటీ, బంజారాహిల్స్: స్టడీటూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది లార్జీడ్యాంలో గల్లంతైన 24మంది విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ఓయూ విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ వరకు సేవ్‌గర్ల్ చైల్డ్ ఇన్ ఇండియా జూబ్లీహిల్స్ చాప్టర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కూడా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థించారు.