50వేల మంది విద్యార్థులకు ఐటీలో శిక్షణ
ఒరాకిల్తో ఒప్పందం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు వీలుగా ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్తో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్(ఐఈజీ) గతంలో ఉన్న ఒప్పందాన్ని ప్రభుత్వం పొడిగించింది. దీనిలో భాగంగా ఒరాకిల్ అకాడమీ రాష్ట్రంలోని 400 విద్యాసంస్థల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను బోధిస్తుంది. 50 వేల మంది విద్యార్థులు, వెయ్యి మంది అధ్యాపకులకు ఒరాకిల్ శిక్షణ ఇస్తుంది. ముందుగా అధ్యాపకులకు జనవరి నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. డేటాబేస్ డిజైన్, ఎస్క్యూఎల్, ప్రోగ్రామింగ్, జావా కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ శిక్షణ ద్వారా 6,85,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. గతంలో ఉన్న ఒప్పందాన్ని మరింత విస్తరిస్తూ ఒరాకిల్తో ఒప్పందం కుదుర్చుకోవడం రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.