వివరం: నిశ్శబ్దాన్ని వినేవాళ్లు
కంటి ద్వారా చూసే ప్రపంచం వాళ్లది. దృశ్యాన్ని శబ్దంలోకి తర్జుమా చేసుకునే నేర్పు వాళ్లది. మౌనాన్ని అనుభవిస్తూ, శరీరపు కదలికలను అనుభూతిస్తూ, ఒళ్లంతా చెవులు చేసుకుంటూ, తమ లోపల మరో మనోలోకాన్ని నిర్మించుకుంటూ, కొన్నిసార్లు వ్యక్తీకరిస్తూ, కొన్నిసార్లు వెల్లడి కాలేక... వారిదో ప్రపంచం! ఒక నిశ్శబ్దపు ప్రపంచం!! మౌఖిక భాష అనే అగాధాన్ని సంకల్పపు గెంతుతో దాటుతూ వాళ్లు సాధించింది, ప్రపంచానికి అందించింది ఎవరికీ తక్కువ కాదు. సెప్టెంబర్ చివరి ఆదివారం నుంచి ‘ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్’ (వినికిడి శక్తి లేనివాళ్ల అంతర్జాతీయ వారోత్సవాలు) సందర్భంగా చరిత్రలో కొందరు చెవిటి విజేతల గురించిన ప్రత్యేక కథనం.
మనిషి తొలి సమాచార మార్పిడి సంజ్ఞలతో చేసుకున్నాడు. సామాన్య జనానికి ఎప్పుడోగానీ అవసరం కాని ఈ మూగసైగలు చెవుడు బారిన పడ్డవాళ్లకు జీవితాంతం అత్యావశ్యాలు. ఆ లెక్కన వారు చేసేది భాషాపోరాటం. దేహాన్ని, చేతుల్ని కదిలిస్తూ, తల కదలికలు, కవళికల ద్వారా తమ లోపలిది ఎదుటివారితో పంచుకుంటూ వాళ్లకు కావాల్సింది తిరిగి పొందుతూ చేయాల్సిన జీవనసమరం మామూలుది కాదు. అలాగని చెవుడు ఉన్న ప్రతివాళ్లూ మాట్లాడలేరని కాదు. మాటను వినకపోవడం వల్ల వాటిని ఎలా వాడుకోవాలో వారికి తెలియదు. ముఖ్యంగా పుట్టుచెవుడు ఉన్నవాళ్లు. అంతేతప్ప వారి స్వర పేటికల్లో ఏ లోపమూ ఉండదు. అంటే చెవుడు ఉన్నవారు బదిరులయ్యే ప్రమాదం ఉంది; అంతేతప్ప చెవుడు ఉన్నవాళ్లందరూ బదిరులు కాదు.
మేమూ సమానమే! ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచజనాభాలో ఇది 5.3 శాతం. వెయ్యి మంది శిశువుల్లో 0.5-5 మందికి పుట్టుకతోనే చెవుడు ఉండటమో, శిశుప్రాయంలోనే దాని బారిన పడటమో జరుగుతోంది. తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్లు, అకస్మాత్తుగా దాడిచేసే అనారోగ్యాలు, మందులు కలిగించే ప్రతికూల ప్రభావాలతో పాటు వంశపారంపర్యంగా కూడా చెవుడు సోకే ప్రమాదం ఉంది. 75-80 శాతం మందికి తల్లిదండ్రుల్లో, పూర్వుల్లో అణిచివేయబడి ఉండిన జన్యువుల ద్వారా సంక్రమిస్తుంది. అంటే, పెద్దవాళ్లలో ఇది బయటపడకపోయినా, పిల్లలకు రావొచ్చన్నమాట! మ్యూజిక్, వినోద సాధనాల ద్వారా ఉత్పన్నం అవుతున్న శబ్ద కాలుష్యం కూడా కౌమారపు పిల్లల్లో వినికిడి లోపం తలెత్తడానికి కారకమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్ల హియరింగ్ ఎయిడ్ వాడకందారులు ఉన్నారని అంచనా! అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని చాలామందికి ఇవి కూడా అందుబాటులో లేవు.
చెవుడు దానికదే ఒక సమస్య అయినా, దానివల్ల శక్తి సామర్థ్యాలకు లోటుండదు. వాళ్లు కూడా అందరిలాంటివాళ్లే. అందరితో సమానమే! ఈ థీమ్‌తోనే ఈ ఏడాది ‘డెఫ్ వీక్’ జరుగుతోంది. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి కేంద్రంగా ఉన్న ‘ద వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్’ దీన్ని జరుపుతోంది. 1958లో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మొదట ‘డే’గా ఉండేవి. తర్వాత వీక్(వారం)గా పాటిస్తున్నారు. భాష, సంస్కృతి, కళ, రాజకీయ, సామాజిక రంగాల్లో వినికిడిలోపం ఉన్నవారి విస్మరించలేని పాత్రను తలుచుకోవడమే ఈ ఏడాది థీమ్. ఆ అంశం ప్రాతిపదికన చరిత్రలో ఎన్నదగిన పాటవం కనబరిచిన కొందరిని తలుచుకుందాం.
దేవుడే ఆమెకు చెవివొగ్గాడు!
15వ శతాబ్దానికి చెందిన స్పెయిన్ సన్యాసిని థెరెసా డె కార్టజీనా. రెండు పదుల వయసులో ఆమె తన వినికిడి శక్తిని కోల్పోయారు. మనోశక్తిని కాదు. ధార్మిక రచనలు చేశారు. గ్రోవ్ ఆఫ్ ద ఇన్ఫర్మ్, వండర్ ఎట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఆమె స్పానిష్ రచనలకు ఇంగ్లీషు పేర్లు. తీవ్రమైన శోకం నన్ను చుట్టుముట్టినప్పుడు, లోతైన దురదృష్టపు సముద్రంలో దారీతెన్నూ లేక కొట్టుకుపోతున్నప్పుడు నాకు చెవివొగ్గింది దేవుడే, అన్నారామె. స్త్రీవాద రచనలకు తొలితరపు ప్రతినిధిగా ఆమెను ఇప్పుడు గౌరవిస్తున్నారు.
ఫ్రెంచ్ భాషనే సంస్కరించాడు!
చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారు ఫ్రాన్స్‌కు చెందిన జొయాచిమ్ డు బెల్లే (1522-60). దాంతో సరైన బాల్యం అనుభవించలేకపోయారు. పైగా యౌవనప్రాయంలో తలెత్తిన అనారోగ్యంతో చెవుడు బారిన కూడా పడ్డారు. ప్రపంచం మూగబోయినా, అతడి లోపలి హృదయం పలికింది; బతికిన అచిరకాలంలోనే గొప్ప కవిగా ఎదిగారు. ఫ్రాన్స్ పునరుజ్జీవన కాలపు మరో ఇద్దరు కవులు పియరే డె రొన్సార్డ్, జీన్ ఆంటోనీ డె బా... తో కలిసి ‘లె ప్లీయాడె’ నెలకొల్పారు. ఇప్పటి ఆధునిక ఫ్రెంచ్ భాష సంస్కరణలకు కారణం కాగలిగిన బృందం అది!
తనువు లోపలి సంగీతం
లుడ్విగ్ వ్యాన్ బీతోవెన్ (1770-1827) గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ప్రకృతిలోకన్నా, తన తనువు నదిలోనే సంగీతం విన్నారేమో! పాశ్చాత్య క్లాసిక్ సంగీతానికి మకుటం లేని మహారాజు లాంటి బీతోవెన్ దురదృష్టం ఏమిటంటే, ఆయన సృష్టించే శబ్దసౌందర్యాన్ని ఆయన వినలేకపోవడం! తన సంగీతానికి ముగ్ధులై కొట్టే ప్రశంసాపూర్వక చప్పట్లు తన చెవి పట్టకపోవడం! జర్మనీలో జన్మించిన బీతోవెన్ తన రుగ్మతని జయిస్తూ, తన అంతర్జ్వాల మొత్తాన్నీ సంగీతంగా పలికించారు. 9 సింఫనీలు (సింఫనీ=స్వరసమ్మేళనం), 5 పియానో కన్సెర్టోలు (పియానో ప్రధాన వాద్యంగా గల ఆర్కెస్ట్రాలు), 32 పియానో సొనాటాలు (సొనాటా= పాడేది కాదు, పలికించాల్సిందని అర్థం), 16 స్ట్రింగ్ క్వాటెట్స్ (నలుగురి బృందంతో కూడిన వయోలిన్ లాంటి తీగవాద్యాల సమ్మేళనం)... ప్రపంచం చెవులారా వినడానికి ఆయన అందించిపోయిన సంగీత నిధి.
వెలిగిన మనసుదీపం!
అమెరికా శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్(1847-1931) ఎడమ చెవి వినబడేది కాదు; కుడిది కష్టంగా వినబడేది. 80 శాతం చెవుడు. చిన్నప్పుడు వచ్చిన స్కార్లెట్ ఫీవర్ దీనికి కారణమంటారు. ఆ సమస్య ఆయనకు ఫోనోగ్రాఫ్(సంగీతం వినడానికి ఉద్దేశించిన రికార్డ్ ప్లేయర్; 1877) కనిపెట్టడంలోగానీ, విద్యుత్ బల్బును వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవడంలోగానీ (1879)అడ్డంకి కాలేదు. తన స్వదేశంలో 1,093 పేటెంట్లు పొందారాయన. మాటలు వచ్చి చెత్త మాటలతో పొద్దు పుచ్చేకన్నా , చెవిటివాడిగా ఉండి పుస్తకం చదువుకోవడం మేలన్న అభిప్రాయం ఆయనది.
దృఢమైన మనసు
మామూలు శబ్దాలు వినబడకపోయినా, రాతిలో శబ్దాన్ని వినగలిగే మృదుస్వభావి డగ్లస్ టిల్డెన్ (1861-1935). అమెరికా గొప్ప శిల్పిగా పేరు మోసిన టిల్డెన్ శిల్పాలు శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా నగర వాసులకు ప్రేరణనిస్తూ ఉంటాయి. ఆయన శిల్పాలు మెకానిక్స్ మాన్యుమెంట్, బేర్ హంట్, ఫుట్‌బాల్ ప్లేయర్స్, అడ్మిషన్ డే మాన్యుమెంట్ ఆ నగరాల్లో ప్రతిష్టించారు. టిల్డెన్ శిల్పాల్లో మగవాళ్లు కండలు తిరిగిన దేహంతో ఉంటారు. హోమోఎరోటిసిజం ఉంటుందని ఫిర్యాదు. మగస్నేహితుల బంధాన్ని చెక్కడానికి ఎక్కువగా ఇష్టపడతాడని ఒక వివరణ!
వినికిడి లోపం గల పిల్లల కోసం ప్రపంచంలో తొలి పాఠశాల నెలకొల్పిన అబ్బే చార్లెస్ మైకేల్ డె ఈపీ
స్వాతంత్య్రానంతర భారతీయ చిత్రకళను ప్రభావితం చేసిన సతీష్ గుజ్రాల్
ఫాదర్ ఆఫ్ ద డెఫ్
వినికిడి లోపం గురించి మాట్లాడుకునేప్పుడు విధిగా స్మరించుకోవాల్సిన పేరు అబ్బే చార్లెస్ మైకేల్ డె ఈపీ (24 నవంబర్ 1712- 23 డిసెంబర్ 1789). ఫ్రాన్స్‌లో జన్మించిన చార్లెస్ చెవిటి పిల్లల కోసం ప్రపంచంలోనే తొలి పాఠశాల(1760) నెలకొల్పిన మహనీయుడు. అందుకే ‘ఫాదర్ ఆఫ్ ద డెఫ్’ అంటారాయన్ని. అలాంటి పిల్లల కోసం సైగల భాషను రూపుదిద్దించుకోవాలన్న ఆలోచన చేసిన తొలివ్యక్తుల్లో ఆయనొకరు. దానివల్లే వారికి అక్షరాస్యత కల్పించి, స్వతంత్రుల్ని చేయగలమని భావించారు. కొత్త విధాన రూపకల్పన కోసం తపించినా, అంత్యదశలో మాత్రం నిర్మాణాత్మక సంకేత విధానం పనికిరాదన్నారు. ఎవరి సైగల భాష వాళ్లు రూపొందించుకోవడమే ఉచితమన్న అభిప్రాయంతో కన్నుమూశారు. అందుకే, ప్రపంచంలో ఏ ఒక్కటో ప్రామాణికమైన సంకేత భాష అంటూ లేదు. కొన్ని వందల సంకేత భాషలున్నాయి. అన్నీ ఆయా స్థానిక బృందాలు వాటికవే అభివృద్ధి చేసుకున్నవే.