ఎయిడ్స్ నివారణకు 'మ్యాజిక్' డ్రగ్!
న్యూయార్క్: ఎయిడ్స్ వ్యాధి నివారణకు అమెరికా పరిశోధకులు 'మ్యాజిక్' డ్రగ్‌ను అభివృద్ధి చేశారు. వ్యాధి కారక హ్యూమన్ ఇమ్యునో వైరస్(హెచ్ఐవీ).. నోరు, యోని ద్వారా వ్యాపించకుండా ఈ కొత్త మందు సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు జంతువులపై జరిపిన ప్రీ క్లినికల్ పరిశోధనల్లో గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.5 మిలియన్ల మంది హెచ్ఐవీ కలిగిన మహిళలు ప్రెగ్నెంట్ అవుతున్నారు. సరైన చికిత్స లేని కారణంగా వీరిలో 45 శాతం మంది తమ పిల్లలకు తల్లిపాల ద్వారా వైరస్‌ను సంక్రమింపజేస్తున్నారు. కొత్త ఔషధం.. 4-ఇథినిల్-2-ఫ్లోరో-2'డిఆక్సియాడినోసైన్(ఈఎఫ్‌డీఏ) ద్వారా ఈ రకమైన సంక్రమణను సమర్థవంతంగా అరికట్టొచ్చని భావిస్తున్నారు. ఇక మహిళల్లో లైంగిక చర్య ద్వారా జరిగే సంక్రమణను కూడా ఇది అరికడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ముందుగా ఎలుకల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఈ ఔషధం మంచి ఫలితాలు ఇచ్చిందని పరిశోధకులు వెల్లడించారు. పరిశోధన ఫలితాలను 'యాంటీమైక్రోబయల్ కీమోథెరపి' జర్నల్‌లో ప్రచురించారు. హెచ్ఐవీ వ్యాప్తి నివారణలో ఈఎఫ్‌డీఏ కీలకంగా పనిచేస్తుందని నార్త్ కరోలినా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంజిలా వహెల్ తెలిపారు.