పసిమొగ్గపై కీచక కాటు
బెంగళూరులోని ఓ స్కూల్లో మూడున్నరేళ్ల చిన్నారిపై రేప్
బెంగళూరు: దేశంలో మృగాళ్ల ఘాతుకాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా వారి అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగళూరులో ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల చిన్నారి తాను చదువుతున్న స్కూల్లోనే అత్యాచారానికి గురైంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. బెంగళూరులోని జాలహళ్లి క్రాస్‌లోని ‘ది ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్’లో మూడున్నరేళ్ల చిన్నారి విద్యనభ్యసిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు బాలిక తల్లి పాఠశాలకు రాగా.. కడుపులో నొప్పిగా ఉందని చిన్నారి తల్లితో చెప్పింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. దీంతో పాఠశాలలోనే తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని బాలిక తల్లిదండ్రులు జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మంగళవారం జరిగిన ఈ ఉదంతం బుధవారం వెలుగు చూడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పాఠశాల వద్దకు చేరుకున్న నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి సంఘటనకు సంబంధించి పాఠశాల పాలక మండలి, విద్యార్థులతో చర్చించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’ కింద కేసు నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.