విద్యుత్ కార్మిక సంఘం ఎన్నికపై గందరగోళం
► సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు వాయిదా వేసిన కార్మిక శాఖ
► కానీ ఈ ఎన్నిక నిర్వహణకు అనుమతినిచ్చిన హైకోర్టు
► ‘వాయిదా’పై స్పందించని అధికారులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ కార్మిక సంఘం ఎన్నికలు గందరగోళంగా మారాయి. శుక్రవారం జరగాల్సిన ఈ ఎన్నికలపై ఇటీవల సిటీ సివిల్కోర్టు స్టే విధించడంతో.. వాటిని వాయిదా వేస్తూ కార్మిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ ఎన్నికలను యథాతథంగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు గురువారమే అనుమతినిచ్చింది. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ఎన్నికల నిర్వహణపై కార్మిక శాఖ అధికారులు స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది.
స్పందించని కార్మిక శాఖ
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థలకు కలిపి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కొద్దిరోజుల కింద సిటీ సివిల్ కోర్టులో కేసు వేసింది. దాంతో ఈ నెల 8న జరగాల్సిన ఎన్నికలపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఎన్నికలను వాయిదా వేస్తూ రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఇస్లావత్ గంగాధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై జెన్కో హైకోర్టును ఆశ్రయించారు.
ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. కానీ ఎన్నికలపై రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో గందరగోళం నెలకొంది. శుక్రవారం ఎన్నికలు జరుగుతాయా? లేదా ? అన్న దానిపై స్పష్టత లేక క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ అధికారులు తల పట్టుకుంటున్నారు. దీనిపై కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.