జైల్లో శశికళ రాజభోగాలపై హోంమంత్రి వివరణ
సాక్షి,బెంగళూర్: ఏఐఏడీఎంకే నేత వికే శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారనే వార్తలను కర్నాటక ప్రభుత్వం తోసిపుచ్చింది. జైలు అధికారులు ఆమెను సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నారని, ప్రత్యేకంగా ట్రీట్ చేయడం లేదని స్పష్టం చేసింది. ‘ శశికళకు, ఆమె బంధువు ఇళవరసికి జైలులో ప్రత్యేక మర్యాదలు చేస్తున్నారని వస్తున్న వార్తలు సత్యదూరం...వారిని సాధారణ ఖైదీలుగానే పరిగణిస్తున్నారు..దీన్ని స్వయంగా తన కళ్లతో చూశా’ నని హోంమంత్రి రామలింగారెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
అవినీతి కేసులో సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిద్దరినీ ఇతర సాధారణ ఖైదీలుగానే జైలు సిబ్బంది పరిగణిస్తున్నారని చెప్పారు. జైలులో శశికళకు ఎలాంటి పని అప్పగించారన్నది తనకు తెలియదని కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆమెకు పనులు కేటాయిస్తారని చెప్పారు. చెన్నయ్‌లో సోమవారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో పాటు ఆమె చేపట్టిన నియామకాలను రద్దు చేసిన విషయం విదితమే.