Organic waste
-
సిద్దిపేటలో వినూత్న ప్రక్రియ
సాక్షి, సిద్దిపేట: వినూత్న ప్రక్రియలకు సిద్దిపేట వేదికగా నిలుస్తోంది. కొన్నేళ్లుగా ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను వార్డు స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి అక్కడ ఎరువు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇలా తయారైన ఎరువును పట్టణంలోని మిద్దె తోటల పెంపకందారులకు నామమాత్ర రుసుముతో అందించాలని యోచిస్తోంది. మున్సిపల్ ఆలోచనకు సత్ఫలితాలు లభిస్తే భవిష్యత్తులో పట్టణంలో మిద్దె తోటల పెంపకానికి సేంద్రియ ఎరువులు అందుబాటులోకి రానున్నాయి. తడి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువు తయారీ ఇలా ఇంట్లో ప్రతిరోజూ మిగిలిపోయిన కూరగాయలు, పూజకు వినియోగించిన పువ్వులు, కుళ్లిన పండ్లు, మిగిలిన అన్నం– కూరలు, మాంస వ్యర్థాలు ఇతరత్రా తడి చెత్త నుంచి సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ ఎరువు తయారు చేసే ప్రక్రియను గతేడాది చేపట్టారు. అందుకు అనుగుణంగానే పట్టణంలోని పాత మాతాశిశు సంక్షేమ కేంద్రం, లింగారెడ్డిపల్లి, మందపల్లి డంప్‌యార్డు, బుస్సాపూర్ డంప్‌యార్డులో తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని ఇళ్ల నుంచి 27 మెట్రిక్ టన్నుల తడి చెత్తను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన తడి చెత్తను నాలుగు ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించి వర్మీ కంపోస్టింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇలా రోజూ సేకరిస్తున్న తడి చెత్త నుంచి ఆయా ప్రాసెసింగ్ యూనిట్లలో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ లెక్కన రోజూ తొమ్మిది మెట్రిక్ టన్నుల తడి చెత్తను ఎరువుగా మార్చుతున్నట్లు మున్సిపల్ రికార్డులు చెబుతున్నాయి. నాలుగు చోట్ల తయారీ స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యంగా పట్టణంలో నాలుగు చోట్ల ప్రస్తుతం తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. మంత్రి హరీశ్‌రావు ఆలోచనకు అనుగుణంగా వార్డు స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లను భవిష్యత్తులో విస్తరించే ఆలోచనలో ఉన్నాం. వార్డులో ప్రజల నుంచి సేకరించిన తడి చెత్తను అదే వార్డులో ఎరువుగా తయారు చేస్తాం. ముందుగా హరితహారం మొక్కలకు, మిద్దె తోటల పెంపకందార్లకు సేంద్రియ ఎరువును పంపిణీ చేస్తాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ బల్దియా ఆలోచన బాగుంది మిద్దె తోటలకు తడి చెత్తతో తయారైన సేంద్రియ ఎరువును అందించాలనే మున్సిపల్ అధికారుల ఆలోచన మంచిది. ప్రస్తుతం పట్టణాలో మిద్దె తోటల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే పెద్దసంఖ్యలో మిద్దె తోటల పెంపకం సాగుతోంది. బహిరంగ మార్కెట్లో పది రూపాయలు పెట్టి ఎరువును కొంటున్నాం. మున్సిపల్ అధికారులు ఇప్పుడు నామమాత్ర ధరతో ఎరువు పంపిణీ చేస్తే ఉపయోగకరమే. – నాగరాజు, మిద్దె తోటల పెంపకదారుడు మిద్దె తోటలకు సరఫరా దిశగా.. జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పట్టణీకరణ పెరుగుతోంది. ప్రజల జీవనశైలి మారుతోంది. తమ అభిరుచులకు అనుగుణంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మున్సిపల్ రికార్డుల ప్రకారం పట్టణంలో అపార్ట్మెంట్ల సంస్కృతి 20 శాతం మేరకు పెరిగింది. అదే సమయంలో ఇష్టపడి నిర్మించుకుంటున్న ఇళ్ల పై భాగంలో మిద్దె తోటల పెంపకానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వంద వరకు మిద్దె తోటలను సంబంధిత గృహ యజమానులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పట్టణంలో తడి చెత్త ద్వారా తయారైన సేంద్రియ ఎరువును హరితహారం మొక్కలకు, రైతులకు పంపిణీ చేసిన మున్సిపల్ అధికారులు ఇక మీదట మిద్దె తోటలకు సేంద్రియ ఎరువును సరఫరా చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే ప్రతిరోజూ తొమ్మిది మెట్రిక్ టన్నుల తడి చెత్త ద్వారా ఉత్పత్తి అవుతున్న సేంద్రియ ఎరువును మిద్దె తోటలతో పాటు హరితహారం కింద పెంచే మొక్కలకు అందించాలని మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే పట్టణంలో ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద ప్రత్యేకంగా సేంద్రియ ఎరువు పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి మిద్దె తోటల యజమానులను చైతన్యం చేసే దిశగా మున్సిపల్ యంత్రాంగం ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది. నామమాత్ర రుసుముతో సేంద్రియ ఎరువును విక్రయించడం ద్వారా తడి చెత్త సమస్య పరిష్కారంతో పాటు బల్దియాకు ఆదాయపరంగానూ కలిసొచ్చేలా ద్విముఖ వ్యూహంతో మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇక్కడ చదవండి: మీకిస్తే సరిపోతుందా .. పొట్టు పొట్టు జేస్తా: మంత్రి మల్లారెడ్డి ఆడియో కరోనా సెకండ్ వేవ్: రానున్న మూడు నెలలూ గడ్డురోజులే! -
గడ్డికి అగ్గి.. భూసారం బుగ్గి!
పంట కోతలు, నూర్పిళ్లు పూర్తయ్యాక గడ్డిని, మోళ్లకు నిప్పంటించడం అనే దురలవాటు వల్ల గాలి కలుషితమవుతుండటమే కాకుండా భూసారం నాశనమవుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల గాలిలో ధూళికణాల సాంద్రత ప్రమాదకర స్థాయికి పెరిగిపోవటంతో ఇటీవల కొన్ని రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించాల్సి రావడం మనకు తెలుసు. ఈ దుస్థితికి ఒకానొక ముఖ్య కారణం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో వరి పంటను యంత్రంతో కోసిన తర్వాత మిగిలే మోళ్లను తగులబెట్టడమేనని తెలిసిందే. ఇలా పంట పొలాల్లో గడ్డీ గాదాన్ని వదిలించుకోవడానికి నిప్పు పెట్టటం వల్ల గాలి పీల్చడానికి పనికిరానంత పాడైపోతోంది సరే. అయితే, భూమికి ఏమేరకు నష్టం జరుగుతోంది? దేశంలో ఏటా 50 కోట్ల టన్నుల పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు. రైతులు తగులబెడుతున్న పంటవ్యర్థాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్య పంటల మోళ్లను, చెరకు ఆకులే 70% వరకు ఉంటాయని, ఇందులో 34% వరి గడ్డి, 22 శాతం గోధుమ గడ్డి ఉన్నాయని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. పంజాబ్‌లో ఏటా 2 లక్షల టన్నుల వరి గడ్డి ఉత్పత్తవుతుండగా, ఇందులో 80 శాతం గడ్డిని తగులబెడుతున్నారు. పొలంలో గడ్డికి నిప్పంటిస్తే ఆ భూమిలో ఒక సెంటీమీటరు లోతు వరకు భూమి పైపొరలో మట్టి 33.8–42.2 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతకు గురవుతుంది. ఫలితంగా భూసారానికి అత్యంత కీలకమైన సూక్ష్మజీవరాశి, శిలీంధ్రాల సంతతి నశించిపోతుంది. అంతేకాదు, భూమి సేంద్రియ లక్షణం కూడా నాశనమవుతుంది. భూమి పైపొరలోని మేలు చేసే మిత్రపురుగులు నశించిపోవడం వల్ల పంటలపై శత్రుపురుగుల దాడి పెరిగిపోతుంది. తగులబడిన భూమి పైపొర మట్టికి నీట కరిగే సామర్థ్యం తగ్గిపోతుంది. ఒక టన్ను పంట వ్యర్థాలను తగులబెట్టినప్పుడు మట్టిలోని సేంద్రియ కర్బనంతోపాటు (5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల ఫాస్ఫరస్, 25 కిలోల పొటాషియం, కిలోకు పైగా గంధకం వంటి) 33.8 కిలోల పోషకాలు నాశనం అవుతున్నాయని ఒక అంచనా. ఖరీఫ్‌లో వరి కోసిన తర్వాత కొద్ది రోజుల్లోనే గోధుమ నాటుకోవాల్సిన అవసరం కొద్దీ రసాయనిక వ్యవసాయం చేసే రైతులు కంబైన్ హార్వెస్టర్ ద్వారా వరి ధాన్యం నూర్పిడి చేసిన తర్వాత మోకాళ్ల ఎత్తున ఉండే మోళ్లను, గడ్డిని తగులబెడుతున్నారు. ప్రభుత్వం నిషేధించినా, జరిమానాలు విధించినా రైతులు ఈ అలవాటు మానలేకపోతున్నారు. అయితే, ఒక అధ్యయనం ప్రకారం పంజాబ్, హర్యానా ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు గడ్డిని అసలు తగులబెట్టడం లేదని తేలింది. ఒకటికి నాలుగు పంటలను కలిపి పండించడం, పంట వ్యర్థాలను భూమికి ఆచ్ఛాదనగా లేదా కంపోస్టు తయారీకి వాడుకోవడం(వ్యర్థాల పునర్వినియోగం).. ఇవి సేంద్రియ సేద్యంలో ముఖ్యమైన నియమాలు. అందువల్ల సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులకు గడ్డిని తగులబెట్టే అవసరం రావడం లేదన్న మాట. రసాయనిక వ్యవసాయం, ఏక పంటల సాగు పద్ధతిలోనే ఈ సమస్య మూలాలున్నాయని గ్రహించాలి. కంపోస్టు తయారీ పద్ధతి వరి గడ్డి వంటి పంట వ్యర్థాలను పశువుల పేడ, మూత్రాన్ని కలిపి సూక్ష్మజీవుల తోడ్పాటుతో కుళ్లబెట్టి కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చు. రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు, తగినంత పొడవుతో గొయ్యి తీయించాలి. అందులో చెత్తను ఆరు అంగుళాల మందం వరకు నింపి, దానిపై పేడ నీటిని, పశుమూత్రాన్ని చల్లాలి. తిరిగి ఇంకొక 6 అంగుళాల మందం వరకు మళ్లీ గడ్డి, పొట్టు వంటి సేంద్రియ వ్యర్థాలు వేయాలి. తిరిగి పేడ నీటిని, పశుమూత్రాన్ని చల్లాలి. ఈ విధంగా గడ్డి గాదాన్ని పొరలు పొరలుగా వేస్తూ.. భూమిపై ఎత్తుగా దిబ్బ వేసుకోవాలి. దిబ్బ లోపలికి గాలి పోకుండా పేడతో పూత పూయాలి. సూక్ష్మజీవుల చర్య ద్వారా గొయ్యిలో వేసిన గడ్డీ గాదం కుళ్లి సుమారు 90–100 రోజుల్లో మంచి సారవంతమైన కంపోస్టు తయారవుతుంది. -
వ్యర్థ పదార్థాలతో వర్మీ కంపోస్ట్
ఖర్చు తక్కువ..దిగుబడి ఎక్కువ ఏడాదికి ఆరుసార్లు తయారు చేయవచ్చు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల ఎరువు ఉపయోగించాలి పీలేరు: వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థా ల మీద ప్రయోగించి తయారు చేసే ఎరువునే వర్మీ కంపోస్టు అంటారు. మామూలుగా తయా రు చేసే ఎరువు కన్నా వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. వర్మీ కంపోస్టులో పోషక విలువ ఎక్కువ. పశువుల పెంటలో సరాసరి నత్రజని, భాస్వరం, పొటాష్, పోషకాలు వరుసగా 0.75, 0.55 శాతం ఉండగా వర్మీ కంపోస్టులో సరాసరి ఇవి 1.60, 5.04, 0.80 శాతం గా ఉంటాయి. వర్మీ కంపోస్టులో సూక్ష్మ పోషకా లు పశువుల ఎరువు కన్నా దాదాపు 50 శాతం అధికంగా ఉంటాయని పీలేరు మండల వ్యవసాయాధికారి షణ్ముగం(8886612565) తెలిపారు. వర్మీ కంపోస్టుకు అవసరమైనవి వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగపడుతాయి. ఇతర అవసరాలు వానపాములు ఎండను తట్టుకోలేవు. కాబట్టి వాటి రక్షణ కోసం తగిన నీడను కల్పించాలి. ఇం దుకు పందిరి వేయటానికి వరిగడ్డి, తాటి ఆకులు, పాత గోనె సంచు లు, పాలిథీన్ సంచులను ఉపయోగించవచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమేకాక ఎరువు నుంచి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవ చ్చు. వర్మీ కంపోస్టు బెడ్లను తయారు చేయటం భూమికి సమాంతరంగా 3 అడుగులు వెడల్పు ఉంటేటట్లు వర్మీ కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగుబాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తువరకు వర్మీ కంపోస్టు చేయాలనుకుంటే కుళ్లుతున్న వ్యర్థ పదార్థాలను(చెత్త, ఆకులు, పేడ మున్నగున్నవి) వేయాలి. ఈ వ్యర్థ పాదార్థాలపైన 5 నుంచి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడ వేయాలి. వ్యర్థ పదార్థాలు, పేడ వేసేటపుడు బెడ్‌పై నీరు చల్లాలి. ఇలా ఒక వారం వరకు నీరు అడపాదడపా చ ల్లుతుండాలి. వారం తరువాత పైన సూచించిన వానపాములను వదలాలి. వానపాములను వదిలేటపుడు బెడ్‌ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి చదరపు మీటరుకు వెయ్యి వరకు వానపాములను వదలాలి. బెడ్‌పైన పాత గోనె సంచులు, వరిగడ్డి పర్చాలి. ఇలా చేయడం వలన తేమను కాపాడటమే కాక కప్పలు, పక్షులు, చీమల నుంచి రక్షణ కల్పించవచ్చు. వానపాములు వదిలిన బెడ్లపై ప్రతిరోజూ నీరు పలుచగా చల్లాలి. బెడ్ నుంచి వర్మీ కంపోస్టును తీయడానికి నాలుగైదు రోజుల ముందుగా నీరు చ ల్లటం ఆపివేయాలి. వానపాములు తేమను వెతుకుతూ లోపలికి వెల్లి అడుగు భాగానికి చేరుతాయి. బెడ్‌పైన కప్పిన గోనె సంచులు, వరిగడ్డిని తీసివేయాలి. ఎరువును శంఖాకారంగా చిన్నచిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2-3 ఎమ్ఎమ్ జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవచ్చు. ఎరువును తొలగించిన బెడ్లపైన వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తువరకు పరచి కంపోస్టును తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు. ఎకారాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వాడవచ్చు వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వరకు వివిధ పంటకు వాడవచ్చును. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చె ట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయడంవల్ల మంచి దిగుబడి సాధించవచ్చు. సంవత్సరానికి రెండు సార్లు వర్మీ కంపోస్టును వాడవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు.