దద్దరిల్లిన గోరంట్ల
గోరంట్ల : తరగతి గదిలో బండ మీద పడి చిన్నారి తన్మయసాయి (4) మృతికి కారణమైన పాఠశాలను సీజ్ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి, మహిళా, రాజకీయ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. తరగతి గదిలో బ్లాక్ బోర్డుగా వినియోగిస్తున్న నల్లబండ మీద పడి పట్టణానికి చెందిన చిన్నారి తన్మయసాయి బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో గురువారం పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ, ధర్నాలు చేపట్టారు.
విద్యార్థి సంఘాల నాయకులు రాంప్రసాద్‌నాయక్, సురేంద్ర యాదవ్, ఎస్ఎఫ్ఐ నాయకులు సతీష్, వెంకటేష్, గంగాధర్‌తో పాటు మహిళ సంఘం నాయకురాలు పావని రమాదేవి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్ష్మినారాయణ యాదవ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందన్నారు. పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ ఆందోళన కారులతో చర్చించారు. డీఈఓ ఇక్కడికి వస్తే తాము ఆందోళన విరమిస్తామన్నారు. దీంతో ఆయన డీఈఓతో మాట్లాడి గోరంట్లకు వస్తున్నట్లు తెలపగా ఆందోళన విరమించారు. అనంతరం డీఈఓ శాంతినికేతన్ పాఠశాలలో సంఘటన స్థలాన్ని పరిశీలించి సీజ్ చేసి, గుర్తింపును రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే బీకే పార్థసారథి చిన్నారి తన్మయసాయి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కోసం జిల్లా కలెక్టర్‌తో చర్చించి రూ.2 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
కన్నీటి సంద్రమైన సూరగానిపల్లి
పుట్టపర్తి అర్బన్: మండలంలోని సూరగానిపల్లి కన్నీటి సంద్రమైంది. గోరంట్ల పట్టణంలో ప్రైవేటు పాఠశాల శాంతినికేతన్లో బుధవారం బండ పడి మృతి చెందిన తన్మయసాయి మృతదేహం గురువారం ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకుంది. చిన్నారిని కడసారి చూడడానికి గ్రామస్తులు తరలివచ్చారు. గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు ఏవీ రమణారెడ్డి, కన్వీనర్లు ఇంటికి వెళ్లి చిన్నారి తల్లితండ్రులు వెంకటేసు, గిరిజను ఓదార్చారు.