ఎల్ఎంవో అనుమతి లేకపోతే జరిమానా
సాక్షి, ముంబై : ఎలాంటి ఆధారం లేకుండా సీఎన్జీని సరఫరా చేస్తున్న నగరంలోని పెట్రోల్ బంక్‌లకు ‘ద లీగల్ మెట్రాలజీ ఆర్గనైజేషన్’ (ఎల్ఎంవో) జరిమానా విధించింది. కాగా, నగరంలోని 128 పెట్రోల్ బంక్‌లకు జరిమానా విధించగా, ఠాణేలో 47, పుణేలో 68 పెట్రోల్ బంక్‌లకు జరిమానా విధించి రూ.మూడు కోట్లను వసూలు చేసింది. ఇదిలా వుండగా, సదరు పెట్రోల్ బంక్‌లు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)ను ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే సరఫరా చేస్తున్నాయని చాలా ఫిర్యాదులు అందాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా ఈ పెట్రోల్ బంక్‌లు వినియోగదారులకు చాలా తక్కువ పరిమాణంలో సీఎన్జీని సరఫరా చేస్తున్నారని ఆర్గనైజేషన్ పేర్కొంది.
ఈ సందర్భంగా ఎల్ఎంవో కంట్రోలర్ అండ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ సంజయ్ పాండే మాట్లాడుతూ.. తాము నగరంలో 128 సీఎన్జీ పంప్‌లపై చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా ఠాణేలోని 47, పుణేలోని 68 పంపింగ్ స్టేషన్లపై కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మహానగర్ గ్యాస్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియమ్, భారత్ గ్యాస్, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ ఇవే కాకుండా ప్రైవేట్ డీడర్స్ కూడా వీరిలో ఉన్నారని ఆయన తెలిపారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకుండా సీఎన్జీని సరఫరా చేస్తుండడంతో వీరికి జరిమానా విధించగా రూ.మూడు కోట్లు చేకూరాయన్నారు.
అయితే సీఎన్జీకి కూడా లీగల్ మెట్రాలజీ ఆర్గనైజేషన్ ధ్రువీకరణ పత్రం అవసరమని తమకు తెలియదని పెట్రోల్ బంక్ యాజమాన్యం పేర్కొందని పాండే తెలిపారు. ఒక వేళ పంప్ ధ్రువీకరణ పత్రం పొందనట్లయితే సదరు పంప్‌లు వినియోగదారులను మోసం చేస్తున్నాయనే భావించాల్సి ఉంటుందన్నారు.
పెట్రోల్ పంప్‌లు కూడా ఆర్గనైజేషన్ ధ్రువీకరణ పత్రం పొందాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా వాహనాలకు గ్యాస్ సరఫరా చేసేవారు ఈ ధ్రువీకరణ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందన్నారు. గత నెల రోజుల నుంచి వీరిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. దీంతో చాలా సీఎన్జీ పంప్‌లు ధ్రువీకరణ పొందలేదని నిర్ధారణ అయిందని పాండే తెలిపారు.