వినోదాత్మక సోషియో ఫాంటసీ
‘‘కథ నచ్చితేనే ఇందులో పాత్ర చేస్తానని ముందే చెప్పాను. కథ విన్నాక చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది. విభిన్నమైన, వినోదాత్మకమైన సోషియో ఫాంటసీ ఇది’’ అని తనికెళ్ల భరణి చెప్పారు. రాజీవ్ సాలూరి, మదిరాక్షి, మౌనిక హీరో హీరోయిన్లుగా శ్రీరామ్ వేగరాజు దర్శకత్వంలో ఛేజింగ్ డ్రీమ్స్ పతాకంపై రవిశంకర్.వి నిర్మిస్తున్న ‘ఓరి దేవుడోయ్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి డి.రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, డా.దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం దర్శకుడు శ్రీరామ్ వేగరాజు మాట్లాడుతూ -‘‘బాగా డబ్బు సంపాదించిన ఓ కుర్రాడు తన సమస్యలతో పాటు తన చుట్టూ ఉన్నవారి సమస్యలను ఎలా పరిష్కరించాడన్నదే ఈ చిత్రం ప్రధాన కథాంశం’’ అని చెప్పారు. సింగిల్ షెడ్యూల్లో జనవరి నాటికి చిత్రాన్ని పూర్తి చేస్తామని నిర్మాత తెలిపారు. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయని రాజీవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా నరేష్, ఎల్బీ శ్రీరామ్, మాటల రచయిత చెబియం శ్రీనివాసన్, సహనిర్మాతలు మాధురి వేగరాజు, హరీష్‌కుమార్ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రతాప్‌కుమార్, సంగీతం: కోటి.