oridinance
-
రాహుల్ గాంధీ కొంపముంచింది అదేనా?
కర్మ సిద్ధాంతం.. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. రాహుల్ గాంధీ విషయంలోనూ ఇప్పుడు అదే జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. అందుకు కారణం ఒకప్పుడు ఏ ఆర్డినెన్స్ అయితే చించేశాడో.. అదే ఆయనపై అనర్హతవేటుపై ప్రభావం చూపెట్టింది. అసలప్పుడు ఏం జరిగిందంటే.. 'లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా'లో 2013లో సుప్రీం కోర్టు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఒక సెక్షన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. అదే ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్ 8(4). ఈ సెక్షన్ ప్రకారం.. ఏదైనా క్రిమినల్ కేసులో 2 లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధికి ఒక వెసులుబాటు కల్పిస్తుంది. శిక్ష తీర్పు వెలువడిన వెంటనే.. ఆ ప్రజా ప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించడానికి వీల్లేదు. అప్పీల్ చేసుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వడంతో పాటు ఒకవేళ పైకోర్టు గనుక స్టే విధిస్తే ఆ అనర్హత నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఈ సెక్షన్ చెబుతుంది. అయితే.. లిలి థామస్ కేసులో కీలకమైన ఈ సెక్షన్‌ను కొట్టేసింది సుప్రీం కోర్టు. కానీ.. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కూటమిగా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. గడ్డి స్కాంలో చిక్కుకుని దోషిగా నిర్ధారణ కావడంతో రెండేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో ఆయన అనర్హుడు అయ్యాడు. అయితే ఈలోపే.. యూపీఏ సర్కార్ తన భాగస్వామిని రక్షించుకోవాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. ప్రత్యేక చట్టసవరణ చేస్తూ ఆఘమేఘాల మీద ఓ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. అది దాదాపు ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(4)కు దాదాపు సమానంగా ఉండింది. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ పైకోర్టును ఆశ్రయించే అవకాశం దక్కింది. అయితే.. ఆ టైంలో రాహుల్ గాంధీ తన సొంత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అది అర్థంలేని ఆర్డినెన్స్ అని మండిపడ్డారు. మీడియా సమావేశం నిర్వహించి మరీ అది చెత్త ఆర్డినెన్స్ అని, ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నానని, అది ఉండాల్సింది చెత్త బుట్టలో అంటూ ఆర్డినెన్స్ కాపీని చించి పడేశారు. వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ఆర్డినెన్స్ ను వెనక్కితీసుకుంటూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్‌పై అనర్హత వేటు పడింది. కాలం గిర్రున తిరిగింది. దాదాపు పదేళ్లు గడిచాయి. ఇప్పుడు, ఆ ఆర్డినెన్స్ ను చించేసిన రాహుల్ గాంధీ.. తానే స్వయంగా అనర్హతకు గురి కావడం విశేషం. 2005లో కేరళకు చెందిన లాయర్ లిలీ థామస్, లోక్ ప్రహారీ ఎన్జీవో కార్యదర్శి ఎస్ఎన్ శుక్లా.. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(4) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో పిల్ పిటిషన్ వేశారు. 2013 జులై 10వ తేదీన జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆ సెక్షన్‌ను కొట్టేసింది. ::: సాక్షి వెబ్ ప్రత్యేకం -
ఆలయాల జీర్ణోద్ధరణకు.. టీటీడీ నుంచి ఏటా రూ. 50 కోట్లు
సాక్షి, అమరావతి : పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ఆదాయంలేక ఆదరణకు నోచుకోని గుడులలో నిత్యం ధూప దీప నైవేద్యాల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇకపై ఏటా రూ.50 కోట్లను దేవదాయ శాఖకు సమకూర్చనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ప్రతి ఐదేళ్లకోసారి పది శాతం చొప్పున పెంచాలని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. ఈ నిధులేవీ ప్రభుత్వ ఖజానాకు చేరవు. దేవదాయ శాఖ నిర్వహించే హిందూ ధార్మిక కార్యక్రమాలకే వీటిని ఖర్చుచేస్తారు. ఇప్పటివరకు ఆయా కార్యక్రమాలకుగాను టీటీడీ ఏటా రూ.2.25 కోట్లను అందజేస్తోంది. అయితే, ఈ కార్యక్రమాలకు శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ దుర్గగుడి, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, కాణిపాకం దేవస్థానాలు ఒక్కొక్కటీ రూ.10 కోట్లకు పైగా అందజేస్తున్నాయి. 2019–20లో శ్రీశైలం ఆలయం ఒక్కటే రూ.32 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో.. టీటీడీ ఏటా చెల్లించే మొత్తాన్ని రూ.50 కోట్లకు పెంచుతూ దేవదాయ శాఖ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఆగస్టులో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చట్ట సవరణ జరిగే వరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ విడుదల చేసింది. సర్వశ్రేయో నిధికే ఏటా రూ.40 కోట్లు కొత్తగా తీసుకొచ్చిన సవరణ ప్రకారం.. దేవదాయ శాఖ పరిధిలో ఉండే సర్వశ్రేయో నిధి (కామన్ గుడ్ ఫండ్–సీజీఎఫ్)కి టీటీడీ ప్రస్తుతం ఏటా రూ.1.25 కోట్లు అందజేస్తుండగా.. ఆ మొత్తాన్ని ఇప్పుడు రూ.40 కోట్లకు పెంచుతూ కూడా చట్ట సవరణ చేశారు. పాడుబడ్డ ఆలయాల పునర్నిర్మాణం.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ధూపదీప నైవేద్య స్కీం (డీడీఎన్ఎస్) వంటి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తారు. అలాగే.. అర్చకులు, ఇతర ఉద్యగుల సంక్షేమ నిధికి టీటీడీ ఇప్పటిదాకా ఏటా రూ.50 లక్షల చొప్పున అందజేస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.5 కోట్లకు పెంచుతూ చట్ట సవరణ చేశారు. అంతేకాక.. దేవదాయ శాఖ పరిపాలన నిధికి టీటీడీ ఇప్పటివరకు ఏటా రూ.50 లక్షల చొప్పున అందజేస్తుండగా, ఆ మొత్తాన్ని కూడా రూ.5 కోట్లకు పెంచి చట్ట సవరణ చేశారు. -
వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు..
-
జాగీరు భూములపై ఆర్డినెన్స్
అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ - ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధిస్తూ ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు.. కల్తీలు, నకిలీలు, మోసాలపైనా ఉక్కుపాదం - నిఘా, తనిఖీల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు - అక్రమార్కులకు సహకరించే అధికారులపై వేటు - ఇందుకోసం కొత్త చట్టాలు రూపొందిస్తాం - అప్పటివరకు ఆర్డినెన్స్‌లు జారీచేసి అమలు చేస్తాం - నకిలీ విత్తనాల నియంత్రణకు కొత్తగా విత్తన చట్టం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాగీరు భూముల రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. జాగీరు భూములు రద్దయినప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని.. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. దీనితోపాటు రాష్ట్రంలో కల్తీలు, నకిలీలు, జూదం, మోసాలపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే కొత్తగా చట్టాలు తేవాలని.. అప్పటివరకు ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని సూచించారు. ఈ ఆర్డినెన్స్‌లపై ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. గురువారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో వివిధ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పి.మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు సి.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, సంతోష్‌రెడ్డి, పార్థసారథి, శాంత కుమారి, కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. కల్తీ నిరోధానికి ప్రత్యేక చట్టాలు కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో మొదటి నుంచీ కఠినంగానే వ్యవహరిస్తున్నామని.. అయినా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కల్తీ అవుతున్నాయని భేటీలో కేసీఆర్ పేర్కొన్నారు. గతేడాది కొంత మందిని పట్టుకుని పీడీ యాక్టు ప్రయోగించి జైల్లో వేశామని.. ఇప్పుడున్న పీడీ యాక్టుకు కొన్ని సవరణలు చేసి, మరింత కఠినతరం చేయాల్సి ఉందని చెప్పారు. ఆహార పదార్థాలు కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారి ఆట కట్టించేలా చట్టాలు ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్తీ చేయలేమని, చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేమనే భయం అక్రమార్కుల్లో ఉండాలని... అందుకు తగిన విధంగా పీడీ యాక్టులో సవరణలు తేవాలని అధికారులను ఆదేశించారు. కల్తీ నిరోధానికి ప్రత్యేక చట్టం తేవాలని, విత్తన చట్టాన్ని రూపొందించాలని చెప్పారు. ఎరువులు, విత్తనాల విషయంలో మోసాలకు పాల్పడే వారిని గుర్తించి, చర్యలు చేపట్టాలని.. వారికి సహకరించే అధికారుల పనిపట్టాలని సూచించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ‘‘ముఖ్యంగా మిర్చి, పత్తి విత్తనాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ముఠాలున్నట్లు తేలింది. మిగతా ప్రాంతాలపైనా దృష్టి పెట్టాలి. వెంటనే టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలి. పోలీసు, వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో టాస్క్‌ఫోర్స్ ఉండాలి..’’ అని కేసీఆర్ సూచించారు. గ్యాబ్లింగ్‌ను నియంత్రించాలి.. రాష్ట్రంలో పేకాట క్లబ్బులను మూసేశామని.. అయినా పలు మార్గాల్లో, ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ జరుగుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. దానిని పూర్తిగా నిరోధించడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవని, కొత్త చట్టం తేవాల్సి ఉందని చెప్పారు. దీనిపై వెంటనే ఆర్డినెన్స్ తేవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇక సైబర్ నేరాలను అదుపు చేయడానికి కూడా కొత్త చట్టం తేవాలని... అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అమ్మే వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. వేగంగా, కఠినంగా వ్యవహరించాలి నేరాలను అదుపు చేయడానికి, నేరస్తులను కఠినంగా శిక్షించడానికి కొత్త చట్టాలు తేవడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ వచ్చిన మరుసటి రోజునుంచే టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగాలన్నారు. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ కరెన్సీనోట్లు చలామణీ చేసే వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని.. అలాంటి ముఠాలను గుర్తించి వారి కార్యకలాపాలను అడ్డుకోవాలని సూచించారు. ‘నకిలీలను పూర్తిగా నియంత్రించడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయా? సవరణలు కావాలా? కొత్త చట్టం రూపొందించాలా?..’ అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని... అవసరమనుకుంటే వెంటనే కొత్త చట్టం తేవాలని అధికారులకు సూచించారు.