అంతటా చీకటే..!
ఏపీ, తెలంగాణలో భయానకంగా అనాథ బాలల పరిస్థితి
అభం శుభం ఎరుగని చిన్నారులు వారు.. తల్లిదండ్రులూ లేక, తమవారనేవారెవరూ లేక అనాథ శరణాలయాల పాలవుతున్నారు.. నిర్వాహకుల దుష్కృత్యాలకు బలయిపోతున్నారు.. మగపిల్లలు కట్టుబానిసలుగా, పారిపోయి దొంగలుగా మారిపోతుంటే.. ఈడొచ్చిన ఆడపిల్లలు లైంగిక దోపిడీకి గురవుతున్నారు, వ్యభిచార గృహాలకు తరలుతున్నారు.. నిండా అంధకారంలో మగ్గిపోతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అనాథ బాలల పరిస్థితి భయానకంగా ఉంది. ఇరు రాష్ట్రాల్లో 1998లో నమోదైన 12 ఏళ్లలోపు అనాథ బాలికల సంఖ్య 4.75 లక్షలు. ఇప్పుడు వారి సగటు వయసు దాదాపు 25 ఏళ్లు. మరి వారంతా ఎక్కడున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎలాంటి జీవితం గడుపుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆందోళన కలిగించేవిగా ఉంటున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోని కారణంగా అత్యధికుల జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయి. చాలా మంది వ్యభిచార గృహాలకు చేరి దుర్భర జీవితం గడుపుతున్నారు. గత పదేళ్లలో పోలీసులు పలుమార్లు పుణే, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లోని వ్యభిచార గృహాలపై దాడులు జరిపినపుడు బయటపడ్డ తెలుగు అమ్మాయిల్లో అత్యధికులు అనాథ శరణాలయాల్లో పెరిగినవారే. వాటి నిర్వాహకుల స్వార్థానికి బలైనవారే. నిర్వాహకులకు సంపాదన తెచ్చిపెట్టే ‘వస్తువులు’గా మారుతున్నారు. కొందరు నిర్వాహకులు బాలికలను లైంగిక దోపిడీకి గురి చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న ఓ అనాథ శరణాలయంలో ఆరుగురు అమ్మాయిలు పెళ్లికాకుండానే గర్భం దాల్చిన ఘటన అనాథ బాలికల భయానక పరిస్థితులకు ప్రత్యక్ష సాక్ష్యం. ఆ ఆరుగురికి పుట్టిన పిల్లలు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని శిశు సదనంలో అనాథలుగానే పెరుగుతున్నారు.
- శరణాలయాల నిర్వాహకుల స్వార్థానికి బలవుతున్న బాల్యం
- వెట్టిచాకిరీ, లైంగిక దోపిడీతో నిత్యం సతమతం
- వ్యభిచార గృహాలకు తరలుతున్న ఆడపిల్లలు
- ఆశ్రమాల్లో ఉన్నప్పుడే గర్భం దాల్చుతున్న దుస్థితి
- కట్టుబానిసలుగా మారుతున్న మగపిల్లలు
- ఆ బాధలు తట్టుకోవడానికి పారిపోయి దొంగలుగా జైళ్లకు..
- పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- నానాటికీ పరిస్థితి మరింత ఆందోళనకరం
అలివేలు ఎక్కడ?
చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు గా మిగిలిన శేఖర్, అలివేలు వేర్వేరు అనాథాశ్రమాల్లో పెరిగారు. అలివేలు కంటే రెండేళ్లు పెద్దయిన శేఖర్‌కు చదువుకోవడం ఇష్టం లేదు. దీంతో అనాథాశ్రమం నిర్వాహకుడు తన ఇంటి పనులకు ఆ బాలుడ్ని వినియోగించుకున్నాడు. పద్నాలుగేళ్లు వచ్చాక సదరు నిర్వాహకుడి ఇంటి నుంచి శేఖర్ పారిపోయి ఓ హోటల్లో పనిచేస్తూ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. పోలీసులు అరెస్టు చేసి జువెనైల్ హోమ్‌కు తరలించారు. మైనారిటీ తీరడంతో ఇప్పుడు అతను చర్లపల్లి జైలులో ఉన్నాడు. మరి అతని చెల్లెలు అలివేలు ఏమైంది? ఆమె ఆచూకీ లేదు. విజయవాడలో ఓ అనాథాశ్రమంలో ఉందని మాత్రమే అతనికి తెలుసు. అతనిచ్చిన సమాచారం మేరకు ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆ అనాథాశ్రమానికి వెళ్లి ఆరా తీస్తే తమ వద్ద లేదని చెప్పారు. వారి స్వస్థలమైన ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ ఆరా తీసినా... ఆమె ఆచూకీ తెలియలేదు. మరి అలివేలు ఏమైంది.. ఎక్కడుంది?
వ్యభిచార గృహాలకు విధి వంచితులు
విధి వంచితులై అనాథాశ్రమాల్లో చేరుతున్న బాలికల్లో వేలాది మంది ఆచూకీ లేదు. కొందరు స్వార్థపరులైన అనాథాశ్రమాల నిర్వాహకులు బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారన్న ఆరోపణలున్నాయి. మరికొందరు వారి పనుల కోసం పలుకుబడి కలిగిన రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల దగ్గరకు అనాథ బాలికలను పంపుతున్నారు. ఇటీవల తెలంగాణ సీఐడీ పోలీసులు పుణెలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసినప్పుడు దొరికిన అమ్మాయిల్లో అత్యధికులు బలవంతంగా ఆ రొంపిలోకి దిగినవారే. వారిలో అత్యధికులు అనాథ బాలికలే. 2011లో ఉమ్మడి రాష్ట్ర పోలీసులు ఢిల్లీలో వ్యభిచారగృహాలపై దాడులు నిర్వహించినప్పుడు దొరికిన వంద మంది మహిళల్లోనూ 43 మంది అనాథాశ్రమాల నుంచి వ్యభిచారగృహాలకు తరలించబడ్డవారే. ‘‘పుణె, ముంబై, కోల్‌కతా, ఢిల్లీలలోని వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న తెలుగు వారిలో అత్యధికులు అనాథ బాలికలే. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో దాదాపు 540 మందిని ఆ కూపం నుంచి బయటకు తీసుకువచ్చాం. వారు వ్యభిచార కేంద్రాలకు ఎలా చేరుకుందీ తెలుసుకుని, బాధ్యులైన 63 మందిపై కేసులు నమోదు చేశాం. అందులో అరడజను మంది వ్యభిచార నిర్వాహకులు ఉన్నారు..’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
దుర్మార్గాలకు నేతల అండ!
అనాథాశ్రమాల ముసుగులో నిర్వాహకులు బాల బాలికల శ్రమను దోపిడీ చేస్తున్నారని కేంద్రానికి అందిన నివేదిక స్పష్టం చేసింది. బాలికలను లైంగిక దోపిడీ చేస్తున్నారని, వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారని వెల్లడించింది. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం... మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఢిల్లీలోని 63 అనాథాశ్రమాలపై వేటువేసింది. వాటిలోని బాల బాలికలను ప్రభుత్వరంగంలోని ఆశ్రమాలు, కార్పొరేట్ సంస్థల అధీనంలోని శరణాలయాలకు తరలించాలని ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఏపీలో 11 అనాథాశ్రమాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అప్పటి పార్లమెంట్ సభ్యుడొకరు కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాశారు. తనతో పాటు మరికొందరు పార్లమెంట్ సభ్యుల సంతకాలతో వినతిపత్రం అందజేశారు. ఆందోళనకర విషయం ఏమిటంటే ఆ జాబితాలో ఉన్న ఓ అనాథ శరణాలయానికి (హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలో) చెందిన అరడజను మంది బాలికలు పెళ్లికాకుండానే గర్భవతులై పిల్లలను కన్నారు. వారంతా ఇప్పుడు అమీర్‌పేట శిశుసదనంలో అనాథలుగానే పెరుగుతున్నారు.
దశాబ్దకాలంలో రూ.1,186 కోట్లు
అనాథ బాలల సంరక్షణ బాధ్యతలు చూస్తున్నామంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 128 స్వచ్ఛంద సంస్థలు గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం, విదేశీ దాతృత్వ సంస్థలు, దేశంలోని వివిధ ప్రైవేట్ ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల నుంచి దాదాపు రూ.1,186 కోట్ల మేర విరాళాలు అందుకున్నాయి. అంటే సగటున రూ.పదికోట్ల చొప్పున అనాథ శరణాలయాలకు అందాయి. అన్ని సంస్థలు ఈ నిధులు ఖర్చు చేస్తున్నాయా లేదా సొంతంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నాయా అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కింద విచారణకు ఆదేశించినా... ఇప్పటికీ ఆ నివేదిక ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఇలా ఓ వైపు విరాళాలు అందుకుంటూనే మరోవైపు బాల బాలికల చేత భిక్షాటన చేయిస్తున్న శరణాలయాలు ఏపీ, తెలంగాణల్లో చాలా ఉన్నాయి.
అనాథల పేరిట వసూళ్లు
హైదరాబాద్‌లో ఏ జంక్షన్లో అయినా రెడ్‌లైట్ పడిందంటే చాలు అరడజను మంది బాలికలు కార్లు, ద్విచక్రవాహనదారుల దగ్గరకు వెళ్లి.. అ నాథల కోసం అని రాసిఉన్న ఒక బాక్స్ చూపి తోచినంత డబ్బు వేయాలని అడుగుతారు. ఇప్పుడు హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణల్లోని ప్రముఖ నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్‌లలో ఇది నిత్యకృత్యం. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఈ దృశ్యాన్ని చూసిన ఓ ఐపీఎస్ అధికారి వీరి వెనుక కథేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. సైనిక్‌పురిలోని ఓ అనాథ శరణాలయం నిర్వాహకుడు అందులో ఉంటున్న బాలికల చేత ఈ పని చేయిస్తున్నట్లు తేలింది. ఆ నిర్వాహకుడిని పిలిచి ప్రశ్నిస్తే విరాళాలు వసూలు చేయడానికి తనకు కేంద్రం అవకాశం కల్పించిందంటూ హోం శాఖ నుంచి వచ్చిన ఒక లేఖను చూపారు. హైదరాబాద్‌లో ఇలాం టి ఎన్ని సంస్థలకు విరాళాలు వస్తున్నాయో తెలుసుకునేందుకు విచారణ జరుగుతోంది.
29 లక్షల మందికి పైనే..
ఏపీ, తెలంగాణల్లో కలిపి 29 లక్షల మంది అనాథలు ఉన్నట్లు ఒక అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ ఏజెన్సీ నిర్వహించిన సర్వే ప్రకారం వారిలో 13 లక్షల మంది బాలికలు, మహిళలు ఉన్నారు. మొదటిసారిగా 1998లో సర్వే నిర్వహించినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అనాథల సంఖ్య 11 లక్షలు, తొమ్మిదేళ్ల తర్వాత 2007లో ఆ సంఖ్య 18 లక్షలకు పెరిగింది. 2011లో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సర్వే చేసినప్పుడు ఉమ్మడి ఏపీలోని అనాథాశ్రమాల్లో 29 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. వీరిలో 13 లక్షల మంది బాలికలు, మహిళలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో మొక్కుబడిగా సర్వే చేసి చేతులు దులుపుకోవడమే తప్ప వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అతి కొద్ది అనాథ శరణాలయాలు, క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న సంస్థలు మినహాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొంది నడుస్తున్న వాటిలో అత్యధికం బోగస్‌వేనని కేంద్రానికి 2011లో నివేదిక అందింది.