సహృదయంతో ఆనాథ యువతితో పెళ్లి
వెంగళరావునగర్: ఆమె పేరు అర్చన. తల్లిదండ్రులు లేరు. ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచీ శిశువిహారే అన్నీ. ఓ ప్రైవేటు సంస్థ సాయంతో పదో తరగతి పూర్తి చేసింది. ఆ తరువాత స్టేట్హోంకు చేరుకుంది. అక్కడి అధికారులు మహిళా శిశు సంక్షేమశాఖ ఆవరణలోని పాలిటెక్నిక్ కళాశాలలో చేర్పించి చదివించారు. చదువు పూర్తి కాగానే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంది. 23 ఏళ్లుగా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న అర్చన అనే అనాథ యువతికి శనివారం నిశ్చితార్థం జరుగబోతోంది.
సూపర్వైజర్ ప్రోత్సాహంతోనే...
అర్చన పని చేసే ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న సుజాత అనే మహిళ ప్రోత్సాహంతోనే ఈ నిశ్చితార్థం జరుగుతోంది. అర్చన క్రమశిక్షణ, సత్ప్రవర్తన సూపర్వైజర్కు ఎంతో నచ్చింది. దాంతో సూపర్వైజర్ సుజాత తన మరిదికి ఆమెను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె సూచన మేరకు తూర్పు గోదావరి జిల్లా ఆకివీడులో ఉంటున్న అత్తమామలు, మరిది వంశీభాస్కర్లు అర్చనను చూసి..పెళ్లికి అంగీకరించారు. స్టేట్హోం ఉన్నతాధికారుల నుంచీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో అర్చన, వంశీభాస్కర్ల నిశ్చితార్థం శనివారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిశ్చితార్థానికి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్టు స్టేట్హోం ఇన్చార్జి గిరిజ తెలిపారు.