ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: జీవో 111 రద్దు అనంతర పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. జీవో ఎత్తివేత తర్వాత ఎదురయ్యే పర్యావరణ సమస్యలను అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా మార్గదర్శకాల జారీకి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా జీవో రద్దుతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే పర్యావరణ వేత్తల ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటూ అచితూచి అడుగులేస్తోంది.
న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా.. జలాశయాల ఉనికికి భంగం కలుగకుండా ప్రణాళికా బద్ధమైన అభివృద్ధికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భారీ నిర్మాణాలు, పరిశ్రమలతో జంట జలాశయాలు కలుషితం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోనుంది. స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకోకుండా.. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, వరద కాల్వల నిర్మాణం, గ్రీన్‌బెల్ట్, బఫర్ జోన్ పరిధుల నిర్ధారణ తదితర అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది.
సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ల నుంచి అభ్యంతరాలు రాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు, నిపుణుల కమిటీ కొత్త నిబంధనల రూపకల్పనలో తలమునకలైంది. జీవో 111 పరిధిలోని ఏడు మండలాల్లో 84 గ్రామాలుండగా వీటిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కలుపుకొని సుమారు 1.35 లక్షల ఎకరాల భూమి ఉంది.
జెడ్‌ఎల్‌డీ ప్రాంతాల్లో నివాస సముదాయాలు
వర్షపాతాన్ని అధ్యయన నివేదిక ఆధారంగా తక్కువ వర్షపాతం ఉండి, జలాశయాల మనుగడకు ఇబ్బంది లేని ప్రాంతాన్ని జీరో లెవల్ డిశ్చార్జి (జెడ్‌ఎల్‌డీ)గా గుర్తించనున్నారు. ఈ ప్రాంతంలో హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారమే నివాస సముదాయాల నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. వాణిజ్య కార్యకలాపాలకు అస్సలు అనుమతులు ఉండవు. ఇక ఈ ప్రాంతాల్లోని నివాసాల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేసి, తిరిగి ఆ నీటిని అక్కడే వివిధ ఇతర అవసరాలకు వినియోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
శాటిలైట్ మ్యాపుల ద్వారా గ్రీన్ చానళ్ల గుర్తింపు..
మురుగు, వర్షపు నీరు జంట జలాశయాలకు చేరితే వాటి ఉనికికే ప్రమాదమనేది పర్యావరణవేత్తల ప్రధాన అభ్యంతరం. దీనికి పరిష్కారం చూపించగలిగితే సమస్య ఉండదని భావించిన నిపుణులు కమిటీ.. అసలు వరద నీరు జలశయాలకు ఏ ప్రాంతం నుంచి చేరుతుందో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. గత 50 ఏళ్ల వర్షపాతాన్ని అధ్యయనం చేసి నీటి ప్రవాహ మార్గాన్ని శాటిలైట్ మ్యాపుల ద్వారా గుర్తించనున్నారు.
జలాశయాల ఎగువ నుంచి వచ్చే ఈ నీరు జీవో 111 పరిధిలోని 84 గ్రామాల గుండా ఎలా ప్రవహిస్తుందో నిర్ధారిస్తారు. ఈ ప్రవాహ మార్గాన్ని గ్రీన్ ఛానల్‌గా గుర్తిస్తారు. ఈ చానల్స్ వద్ద వరద కాలువలను నిర్మిస్తారు. ఒకవేళ కాలువల నిర్మాణం కోసం భూములు తీసుకోవాల్సి వస్తే గనక ప్రస్తుత మార్కెట్ రేటు కట్టి ఇవ్వాలని, అప్పుడే భూ యజమానులు ముందుకొస్తారని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది.
బఫర్ జోన్ 500 మీటర్లే!
ప్రస్తుతం జంట జలాశయాల చుట్టూరా 10 కిలో మీటర్ల ప్రాంతాన్ని చెరువు పూర్తి స్థాయి సామర్థ్యం (ఎఫ్టీఎల్)గా పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతంలో కేవలం పదిశాతం విస్తీర్ణంలో మాత్రమే నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. అయితే కొత్త నిబంధనలలో ఎఫ్టీఎల్ స్థానంలో 500 మీటర్ల వరకే బఫర్ జోన్ ఉండనుంది. ఈ జోన్ పరిధిలో నిర్మాణాలపై ఆంక్షలుంటాయి. కాగా 300 చదరపు మీటర్లకు పైన ఉన్న ప్లాట్లకు కనిష్టంగా మీటరు వెడల్పుతో ఒకవైపున గ్రీన్ బెల్ట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.