కేసీఆర్ ఓయూలో ఎందుకు మాట్లాడలేదు
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ప్రసంగించకపోవడమేంటని సీఎల్పీ ఉపనేత టి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఉత్సవాల్లో వారు ప్రసంగించకపోవడం దారుణమైన విషయమని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమాల పురిటగడ్డ ఓయూ గురించి, విద్యార్థుల త్యాగాల గురించి మాట్లాడనందుకు కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. రాష్ట్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముందే కేసీఆర్ మాట్లాడలేక పోయారంటే, ఓయూ విద్యార్థులంటే ఆయన ఎంత భయపడుతున్నారో అర్థమవుతుందన్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడే కేసీఆర్, గవర్నర్ ఈ ఉత్సవాల్లో ప్రసంగించలేదన్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక, మూడేళ్ల తర్వాత ఓయూలో అడుగు పెట్టిన కేసీఆర్ అక్కడి నుంచి మూగ వాడిగా వెనుతిరిగారని ఎద్దేవాచేశారు. విద్యార్థుల నిరసనలకు ఎదుర్కోలేకనే కేసీఆర్ మాట్లాడేందుకు సాహసించలేదన్నారు. సీఎంకేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఓయూ విద్యార్థుల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.
రాష్ట్రంలో ఉద్యమాలను పోలీసు రాజ్యంతో అణచాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఓయూకు టీఆర్ఎస్ పాలనలో ఓయూ కు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గ్రేడింగ్ కూడా లేకుండా పోయిందన్నారు.