గోపేష్... ఓ గాజుబొమ్మ!
మలికిపురం: ఏ తల్లైనా.. తొమ్మిది నెలలు తన కడుపున పదిలంగా మోసి, పేగుసారం పోసి కన్న బిడ్డ చకచకా ఎదగాలని తపిస్తుంది. కానీ.. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం లక్కవరానికి చెందిన గుబ్బల ఓగిరాణికి ఆ అవకాశమే లేకుండా పోయింది. కారణం.. ఆమె బిడ్డ ఎముకలు గాలి గట్టిగా వీస్తే పూచికపుల్లల్లా విరిగిపోయేంత బలహీనమైనవి కావడమే.
ఓగి రాణి, విజయకుమార్ దంపతుల బిడ్డ గోపేష్ నాగసాయి మణికంఠ.. మూడో నెల వయసప్పుడు మంచంలో గుక్కపట్టి ఏడుస్తుండగా వెళ్లి చూశారు. పరీక్షగా చూస్తే కాలు విరిగినట్టు తేలింది. కారణమేమిటో అంతుపట్టని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కట్టుకట్టారు. తర్వాత గోపేష్ ఛాతీ ఎముకలు తరచు వాటంతటవే విరిగిపోనారంభించాయి.
అమలాపురం, కాకినాడల్లో వైద్యులకు చూపారు. ఆ వైద్యులు గోపేష్ స్థితిని ముంబయిలోని నిపుణులకు వివరించగా.. అది అరుదైన సమస్య అని, అమెరికాలాంటి దేశాల్లో తప్ప చికిత్స లభ్యం కాదని, అదిన్నీ రూ.కోట్లలో వ్యయమవుతుందని చెప్పారు. కూలి పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చే విజయకుమార్ దంపతులు కలలో కూడా కంటచూడని అంత మొత్తాలు కూడబెట్టటం తమవల్ల కాదని, బిడ్డ భవిష్యత్తును భగవంతునికి వదిలివేశారు. మధ్యమధ్యలో విరిగే ఎముకలకు కట్లుకట్టిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం గోపేష్ వయసు 8 ఏళ్లు. ఆ చిన్నారికి సోకిన వ్యాధిని ‘ఆస్టియో క్లీరోసిస్’ అంటారని, ఇది నయం కాని వ్యాధి అని మలికిపురంలోని వైద్యులు చెప్పారు.