పోలీసుల బదిలీలలో పొరుగుపెత్తనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
విశాఖ పోలీస్ రేంజ్ పరిధిలో ఇటీవల జరిగిన ఇనస్పెక్టర్ల బదిలీలు ఆ శాఖలో ఇప్పటికీ చర్చలకు తావిస్తున్నాయి. పనితీరు, సీనియారిటీ, ట్రాక్ రికార్డు ప్రామాణికంగా కాకుండా.. కులాల ప్రాతిపదికన ఈ బదిలీలు జరగడం వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తెచ్చుకున్న వారిని అందలమెక్కించడం.. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలతో పైరవీలు చేయించుకున్న వారికి కోరుకున్న చోటుకు బదిలీ చేయడం కలకలం రేపుతోంది. అధికారం దన్నుతో నోటికొచ్చినట్టు మాట్లాడి దురుసుగా వ్యవహరించే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి సీఐల బదిలీల్లో తన వర్గం మార్కు చూపించారు. తన సామాజికవర్గానికి చెందిన సీఐలను రేంజ్లో కీలకమైన పోలీస్‌స్టేన్లలో పోస్టింగులు ఇప్పించుకున్నారు.
సిక్కోలు నేత సిత్రాలు ఇవే..
విశాఖ వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీస్స్టేన్లో పని చేస్తున్న ఇన్స్పెక్టర్.. ఎంవీపీ సీఐగా బదలీ కావడం వెనుక సదరు నేత సిఫారసు గట్టిగా పనిచేసిందని తెలుస్తోంది. విశాఖ మెరైన్ పోలీస్ విభాగంలో ఉన్న ఓ సీఐని ఇచ్ఛాపురం పోలీస్‌స్టేçÙన్కు బదలీ చేయించుకున్నారు. పరవాడలో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ను ఎస్కోటకు, స్టీల్‌ప్లాంట్ పోలీస్‌స్టేçÙన్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న సీఐని శ్రీకాకుళం విజిలెన్స్‌కు బదలీ చేయించడం వెనుక సదరు ప్రజాప్రతినిధి సిఫారసు లేఖలు, పైరవీలు, ఒత్తిళ్లు పనిచేశాయనేది పోలీసువర్గాలే అంగీకరిస్తున్న వాస్తవం. అందుకే ఆ వర్గానికి చెందిన పోలీసులందరూ సదరు ప్రజాప్రతినిధి విశాఖ సర్కూ్యట్ హౌస్‌లో బస చేయడానికి వస్తే చాలు అక్కడ వాలిపోయి బారులు తీరుతుంటారు. పోలీసుశాఖలో వర్గ ప్రాబల్యం కోసం, విశాఖలో కూడా తనవాళ్లు ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ఈసారి సీఐల బదిలీల్లో చక్రం తిప్పేశారు. ఇప్పటికే రేంజ్లో సబ్ డివిజనల్ స్థాయిలో ఉన్న సదరు ప్రజాప్రతినిధి సోదరుడు ఆవర్గ పోలీసులకు, ఆయనకు మధ్య వారధిలా పనిచేస్తున్నాడనేది పోలీసుశాఖలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
ఖాకీ బాస్‌లపై ఒత్తిళ్లు
ఇక శ్రీకాకుళం జిల్లాకే చెందిన మరో ప్రజాప్రతినిధి కూడా తన సామాజికవర్గ పోలీసుల బదిలీల్లో కీలకపాత్ర పోషించారు. ఎంవీపీలో పనిచేసిన ఓ సీఐ అనకాపల్లికి బదలీ కావడం, విశాఖ ట్రాఫిక్‌లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ నగరంలోని నాలుగోటౌన్కు బదలీ కావడం, విజయనగరం జిల్లా గజపతినగరంలో పని చేసిన అధికారి యలమంచిలికి బదలీ కావడం వెనుక సదరు నేత పైరవీలు, సిఫారసులే కారణమని అంటున్నారు. వాస్తవానికి ఒక నియోజకవర్గ పరిధిలోని పోలీస్‌స్టేçÙన్ల సీఐలు, ఎస్ఐల బదలీలకు మాత్రమే అక్కడి ఎమ్మెల్యే సిఫారసు లేఖలు ఇవ్వొచ్చు. కానీ సామాజికవర్గమే నేపథ్యంగా తమవారు విశాఖలో కీలక పోస్టుల్లో ఉండాలన్న ఉద్దేశంతో సదరు ఎమ్మెల్యేలు పొరుగు జిల్లాల్లోని పోలీసుల బదలీల్లో కూడా జోక్యం చేసుకున్నారు. కోరుకున్న చోటకు బదిలీలతో పాటు ఇష్టం లేని చోట నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయ్యేందుకు కూడా పోలీసులు సదరు శ్రీకాకుళం ఎమ్మెల్యేనే ఆశ్రయిస్తున్నారు. మల్కాపురంలో సీఐగా పనిచేసి ఆరోపణల్లో కూరుకుపోయిన ఓ అధికారిని ఉన్నతాధికారులు మొదట జీకేవీధికి బదిలీ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వర్తించడం ఇష్టం లేని ఆ సీఐ దీర్ఘకాల లీవు పెట్టేసి తన సామాజికవర్గానికి చెందిన శ్రీకాకుళం ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఆ సీఐ తరఫున వకాల్తా పుచ్చుకున్న సదరు ఎమ్మెల్యే ఇప్పుడు ఆ అధికారి బదలీ కోసం రేంజ్ ఉన్నతాధికారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. పోస్టింగ్ పొందిన స్టేషన్లో ఉద్యోగం చేయకుండా లీవు పెట్టేసి ఆనక ఎమ్మెల్యేతో ఒత్తిడి చేయించిన ఆ సీఐ పట్ల ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు ఇలా రేంజ్ పరిధిలోని పోలీస్ బదిలీల్లో ఇష్టారాజ్యంగా జోక్యం చేసుకుంటుంటే విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు చేష్టలుడిగి చూస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సిఫార్సు లేఖలతో బదలీలు ఎలా?
మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్న సిఫారసు లేఖల పోస్టింగులతో వర్గ ప్రాబల్యం, రాజకీయ పలుకుబడి లేని పోలీసులు బలవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ట్రాక్రికార్డు బాగున్నప్పటికీ కేవలం ఎమ్మెల్యే లెటర్ లేక పోవడం వల్ల పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న పోలీసుల జాబితా చాలానే ఉంది. పోలీసుల బదిలీల్లో ఎమ్మెల్యే లేఖలతో పాటు కొన్ని సందర్భాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీల సిఫారసులు కూడా పనిచేస్తున్నాయంటే బదిలీల ఫార్సు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సిఫారసు లేఖల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పోలీసులు పోస్టింగ్ తర్వాత ఆ ప్రజాప్రతినిధిని కాదని అక్కడ పార్టీలు, రాజకీయాలకతీతంగా ఏవిధంగా పని చేస్తారన్న ప్రశ్నలకు ఉన్నతాధికారుల వద్ద కూడా సరైన సమాధానం దొరకడం లేదు.