ఓయూ..ది గ్రేట్!
ఐదుగురు కొత్త వీసీలు ఓయూకు చెందినవారే...
సాక్షి, సిటీబ్యూరో: విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాల్లో ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీకి పెద్దపీట దక్కింది. రాష్ట్రంలో తొమ్మిది యూనివర్సిటీలకు నియమితులైన వీసీల్లో.. ఐదుగురు ఓయూకే చెందినవారు కావడం విశేషం. ఓయూ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ రామచంద్రం, జేఎన్టీయూహెచ్ వీసీగా విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ ఏ. వేణుగోపాల్‌రెడ్డి, తెలుగు వర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఆర్.సాయన్న, పాలమూరు వర్సిటికీ వీసీగా సికింద్రాబాద్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.రాజరత్నం బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణలోనేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సింహభాగం వర్సిటీలకు ఓయూ ఆచార్యులే నియమితులవుతూ వస్తుండడం విశేషం. ఉన్నత విద్యా వ్యాప్తిలోనే కాదు.. ఉన్నత పదవులు అలంకరించడంలోనూ ఓయూ తన మార్కు ప్రదర్శిస్తోంది.
98 ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూ నుంచి 70 మందికిపైగా ఆయా వర్సిటీలకు వీసీలుగా పనిచేశారని తెలుస్తోంది. ముఖ్యంగా 2006 తర్వాత జిల్లాకో వర్సిటీ ఏర్పాౖటెన విషయం తెలిసిందే. ఒకటి రెండు తప్ప మిగిలిన వర్సిటీ పాలనా పగ్గాలు వీరే చేపట్టడం ఓయూ ఘనతకు నిదర్శనంగా చెప్పవచ్చు. జాతీయ స్థాయి వర్సిటీలను కూడా ఓయూ ఆచార్యులు ముందుండి నడిపించారు.