రేపటి నుంచి ఓయూసెట్
హైదరాబాద్: ఓయూసెట్– 2017 ప్రవేశ పరీక్షలు సోమ వారం (5వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ శనివారం తెలిపారు. ఓయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ వివిధ పీజీ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఈ నెల 13 వరకు జరిగే ప్రవేశ పరీక్షలకు నగ రంలో 22 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 90 వేల మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షకు 20 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామన్నారు. పరీక్ష హాల్లో హాజరుకు కుడి, ఎడమ చేతి వేలిముద్రలతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.