Our Legends
-
జాతీయవాద వ్యాపారవేత్త కస్తూర్భాయ్ లాల్‌భాయ్
మన దిగ్గజాలు వ్యాపారం చేయడం ఆషామాషీ కాదు. అందునా ముక్కుపచ్చలారని పదిహేడేళ్ల కుర్రాడు నష్టాల్లో ఉన్న సంస్థను గాడిలో పెట్టి లాభాలబాట పట్టించడం అంత తేలికేమీ కాదు. విదేశీయుల పాలన కొనసాగుతున్న కాలంలో స్వదేశాభిమానాన్ని, స్వాభిమానాన్ని వదులుకోకుండానే ఈ ఘనతను సాధించారు కస్తూర్భాయ్ లాల్‌భాయ్. మన దేశం గర్వించదగ్గ తొలితరం పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యులుగా ఎన్నదగిన అతి కొద్దిమందిలో కస్తూర్భాయ్ కూడా ఒకరు. గుజరాత్‌లోని జవేరీవాడ్లో 1894 డిసెంబర్ 19న సంప్రదాయ జైన కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లాల్‌భాయ్ దళపత్భాయ్, తల్లి మోహిని. కస్తూర్భాయ్ పూర్వీకులు మొఘల్, బ్రిటిష్ పాలకుల హయాంలో అహ్మదాబాద్ నగరానికి కొత్వాల్లుగా పనిచేసేవారు. వారి వంశంలో తొలిసారిగా కస్తూర్భాయ్ తాత బాగ్భాయ్ వ్యాపారరంగంలోకి అడుగుపెట్టారు. ఆయన వస్త్రవ్యాపారం చేసేవారు. కస్తూర్భాయ్ తండ్రి లాల్‌భాయ్ దళపత్భాయ్ 1896లో సరస్పూర్ కాటన్ మిల్లును స్థాపించారు. కస్తూర్భాయ్ విద్యాభ్యాసం అహ్మదాబాద్‌లో సాగింది. పదిహేడో ఏట కాలేజీలో చేరిన మొదటి ఏడాదిలోనే తండ్రి లాల్‌భాయ్ మరణించారు. చదువు మానేయాల్సి వచ్చింది. ఆస్తి పంపకాల్లో భాగంగా కస్తూర్భాయ్ వాటాకు రాయ్‌పూర్ మిల్లు వచ్చింది. కార్మికులతో సమానంగా... రాయ్‌పూర్ మిల్లు కస్తూర్భాయ్ చేతికి వచ్చేనాటికి మిల్లు నష్టాల్లో ఉండేది. పరిస్థితిని చక్కదిద్దడానికి కస్తూర్భాయ్ అహరహం మిల్లు అభివృద్ధికి పాటుపడ్డారు. కార్మికులతో సమానంగా కష్టపడ్డారు. వాళ్లతో కలిసే భోంచేసేవారు. కలిసే నిద్రపోయేవారు. అనతికాలంలోనే మిల్లులోని అన్ని విభాగాలపైనా పట్టు సాధించారు. ఆయన తమలో ఒకడిలా పనిచేయడంతో కార్మికుల్లోనూ ఉత్సాహం ఇనుమడించింది. క్రమంగా మిల్లు లాభాలబాట పట్టింది. రాయపూర్ మిల్లు అనుభవం ఉజ్వలమైన ఆయన భవితవ్యానికి పునాది వేసింది. ఆయన శ్రమ వృథా కాలేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఉత్పత్తులకు విపరీతంగా పెరిగిన గిరాకీని అందిపుచ్చుకున్న కొద్దిమంది తొలితరం పారిశ్రామికవేత్తల్లో కస్తూర్బాయ్ కూడా ఉన్నారు. రాయ్‌పూర్ మిల్లుకు బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్‌లో ఒకరిగా 1918లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకే సొంతగా అశోకా మిల్స్‌ను స్థాపించారు. సన్నిహితుడైన దయాభాయ్ మోతీలాల్ పటేల్‌ను అశోకా మిల్స్ జనరల్ మేనేజర్‌గా నియమించుకున్నారు. దయాభాయ్ సలహాలతో సోదరులను భాగస్వాములుగా చేసుకుని, వ్యాపారాలను శరవేగంగా విస్తరించారు. 1924-38 కాలంలో నాలుగు మిల్లులను స్థాపించారు. వాటిని ఎప్పటికప్పుడు కొత్త కొత్త యంత్రాలతో ఆధునికీకరించేవారు. అప్పట్లో దేశంలోని మొత్తం స్పిన్నింగ్ పరిశ్రమలో కస్తూర్భాయ్ ఒక్కరిదే 12 శాతం వాటా అంటే ఆయన విస్తరణ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవాల్సిందే! అమెరికన్ కంపెనీ ‘సైనమిడ్’ సహకారంతో 1952లో దేశంలోనే తొలిసారిగా అధునాతన అద్దకం సంస్థ ‘అతుల్ లిమిటెడ్’ను స్థాపించారు. స్వదేశీ ఉద్యమానికి బాసట బ్రిటిష్ హయాంలో కస్తూర్భాయ్ 1923లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ పదవిలో కొనసాగిన మూడేళ్లలోనూ దేశంలోని పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశారు. గాంధీజీ 1930లో స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆయనకు బాసటగా నిలిచారు. అప్పట్లో దేశం ద్రవ్యోల్బణంతో అల్లాడేది. అలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలపై పన్నుల భారం తగ్గించేలా బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడిగా 1934లో ఎన్నికయ్యారు. మరుసటి ఏడాదే అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రిటిష్ పాలన కొనసాగుతుండగానే 1937లో రిజర్వ్‌బ్యాంకు డెరైక్టర్‌గా నియమితుడై, ఆ పదవిలో పన్నెండేళ్లు కొనసాగారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పలు గౌరవ పదవుల్లో కొనసాగారు. అహ్మదాబాద్‌లో ఐఐఎంతో పాటు ఇస్రో, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ వంటి పలు విద్యా, పరిశోధన సంస్థలకు భూములను విరాళంగా ఇచ్చారు. అహ్మదాబాద్‌లో ఉన్నత విద్యావ్యాప్తి కోసం 1936లో అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. ఇప్పుడది అహ్మదాబాద్ వర్సిటీగా రూపుదిద్దుకుంది. ఆర్థిక, విద్యా, సేవారంగాలలో కస్తూర్భాయ్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1969లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన 1960లోనే తన వ్యాపారాలను ఇద్దరు కుమారులకు అప్పగించేసి, తర్వాతి కాలమంతా సేవారంగానికి అంకితమయ్యారు. జాతీయవాదానికి, వ్యాపార దక్షతకు, వదాన్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కస్తూర్భాయ్ 1980 జనవరి 20న అహ్మదాబాద్‌లో కన్నుమూశారు. - దండేల కృష్ణ -
హమారా బజాజ్
మన దిగ్గజాలు తొలితరం పారిశ్రామికవేత్తల్లో ఆయన ప్రముఖుడు. స్వశక్తితో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కార్యదక్షుడు. నిబద్ధతగల జాతీయవాది. స్వాతంత్య్ర సమరయోధుడు. స్వాతంత్య్ర సమరం ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో మహాత్ముని వెన్నంటి ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడిచినవాడు. మహాత్ముని ఆదరాభిమానాలను చూరగొన్నవాడు. జమ్నాలాల్ బజాజ్‌పై మహాత్మా గాంధీ పుత్రవాత్సల్యం చూపేవారు. అంతేకాదు, జమ్నాలాల్ నా దత్తపుత్రుడు అని మహాత్ముడు బహిరంగంగా ప్రకటించారంటే, వారిద్దరి మధ్య అనుబంధం ఎంతటితో ఊహించాల్సిందే! నిరుపేద నేపథ్యం రాజస్థాన్‌లోని సికార్ సమీపంలో కాశీ కా బాస్ ఒక కుగ్రామం. జమ్నాలాల్ బజాజ్ 1889 నవంబర్ 4న ఆ గ్రామంలో నిరుపేద మార్వాడీ కుటుంబంలో జన్మించారు. కనీరాం, బిర్దీబాయి దంపతులకు జమ్నాలాల్ మూడో సంతానం. ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో కనీరాం దంపతులు జమ్నాలాల్‌ను వార్ధాకు చెందిన వర్తక ప్రముఖుడు సేఠ్ బచ్రాజ్కు పెంపకానికి ఇచ్చేశారు. సేఠ్ బచ్‌రాజ్ పెంపకంలో జమ్నాలాల్ చిన్న వయసులోనే వ్యాపారంలో మెలకువలను తెలుసుకున్నారు. సేఠ్ బచ్‌రాజ్ మరణించడంతో ఆయన వ్యాపారానికి వారసుడైన జమ్నాలాల్ బచ్‌రాజ్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను నెలకొల్పారు. కాలక్రమంలో ఇది విస్తరించి, బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌గా ఎదిగింది. ఈ గ్రూప్‌లో ఇప్పుడు ముప్పయికి పైగా కంపెనీలు పనిచేస్తున్నాయి. బజాజ్ గ్రూప్ విస్తరిస్తున్న రోజుల్లో కొన్ని దశాబ్దాల పాటు స్కూటర్లు, ఆటోరిక్షాల మార్కెట్లో తిరుగులేని హవా కొనసాగించింది. బ్రిటిష్ హయాంలో బజాజ్ అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లోని వర్తక, పారిశ్రామిక ప్రముఖులను మచ్చిక చేసుకునేందుకు వారికి గౌరవ పదవులు, బిరుదులు కట్టబెట్టేది. మొదటి ప్రపంచ యుద్ధం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి ఉదారంగా విరాళం ఇచ్చిన జమ్నాలాల్ బజాజ్‌ను గౌరవ మేజిస్ట్రేట్‌గా నియమించింది. ఆ తర్వాత ‘రాయ్ బహద్దూర్’ బిరుదుతో సత్కరించింది. అయితే, తర్వాతి కాలంలో మహాత్మాగాంధీ ప్రభావంతో జమ్నాలాల్ జాతీయ ఉద్యమం వైపు మొగ్గారు. గాంధీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన బిరుదును వెనక్కు ఇచ్చేశారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. నాగపూర్‌లోని అఖిల భారత కాంగ్రెస్ సభలకు రిసెప్షన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించి, ఆ సభలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. గాంధీతో సాన్నిహిత్యం జమ్నాలాల్ సహాయ నిరాకరణ ఉద్యమ కాలం నుంచి గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. సబర్మతిని విడిచి ఆశ్రమాన్ని వార్ధాలో ఏర్పాటు చేసుకోమని గాంధీని కోరేవారు. చివరకు ఉప్పు సత్యాగ్రహం తర్వాత 1930లో గాంధీ తన ఆశ్రమాన్ని వార్ధా సమీపంలోని సేవాగ్రామ్‌లో ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఏర్పడిన గాంధీ సేవా సంఘానికి జమ్నాలాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో చురుగ్గా కొనసాగుతూ 1933లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత కాంగ్రెస్ కోశాధికారిగా ఎన్నికయ్యారు, అస్పృశ్యత నివారణ, ఖద్దరు వ్యాప్తి వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే జమ్నాలాల్ తనకు ఐదో కొడుకులాంటి వాడని, తాను ఆయనను దత్తత స్వీకరిస్తున్నానని గాంధీ స్వయంగా ప్రకటించారంటే, వారిద్దరి సాన్నిహిత్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. అయితే, కొన్ని అంశాల్లో ఆయన గాంధీతో విభేదించిన సందర్భాలూ లేకపోలేదు. కేంద్ర శాసనసభకు 1933లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయరాదని భావించారు. అయితే, జమ్నాలాల్‌ను శాంతింపజేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయనను హరిపురా సదస్సుకు అధ్యక్షునిగా ఎంపిక చేసింది. గాంధీ కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. జమ్నాలాల్ మాత్రం దీనిని సున్నితంగా తిరస్కరించి, హరిపురా సదస్సుకు అధ్యక్ష బాధ్యతలను సుభాష్‌చంద్ర బోస్‌కు అప్పగించారు. చివరి వరకు స్వాతంత్య్రం కోసం పరితపించిన జమ్నాలాల్ 1942 ఫిబ్రవరి 11న అనారోగ్యంతో వార్ధాలో కన్నుమూశారు. జమ్నాలాల్ మరణం తర్వాత ఆయన వారసులు బజాజ్ వ్యాపార సామ్రాజ్యాన్ని దేశం గర్వించే స్థాయిలో విస్తరించారు. మహాత్మాగాంధీ ప్రభావంతో జమ్నాలాల్ జాతీయ ఉద్యమం వైపు మొగ్గారు. గాంధీ నేతృత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన బిరుదును వెనక్కు ఇచ్చేశారు. -
'నిర్మ'ల విజయుడు!
మన దిగ్గజాలు విజయానికి కావల్సింది ఏమిటి? విజయం గురించి ఆలోచించడం. కె.కె.పటేల్ అదే చేశారు. అక్కడితో ఆగిపోలేదు. ఆలోచనను ఆచరణలోకి తెచ్చారు. ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ యజమానిగా అతి పెద్ద విజయాన్ని సాధించారు... బహుళజాతి కంపెనీలను చూసి మామూలుగానైతే చిన్న కంపెనీలు భయపడతాయి. వాటి నడక తడబడుతుంది. కొన్నిసార్లు వాటి ఉనికి కూడా లేకుండా పోతుంది. అన్ని సందర్భాల్లోనూ ఇదే నిజం కాకపోవచ్చు అని చెప్పుకోవడానికి ‘నిర్మా వాషింగ్ పౌడర్’ ఒక తిరుగు లేని ఉదాహరణ. డెబ్బైలలో డిటర్జెంట్ మార్కెట్లో ‘సర్ఫ్’... మొదలైనవి రాజ్యం ఏలుతున్న కాలం. బరిలోకి దిగడానికి కూడా ఇతరులు భయపడే కాలం. అలాంటి కాలంలో ఒకే ఒక్కడుగా డిటర్జెంట్ మార్కెట్లోకి అడుగుపెట్టి అపూర్వ విజయాన్ని సాధించారు కర్సన్ భాయ్ పటేల్. ఒకప్పుడు ఇంటింటికీ తిరిగి డిటర్జెంట్ పౌడర్ అమ్మిన కర్సన్ భాయ్... ఇంతింతై వటుడింతై అన్నట్లుగా... ఈరోజు 2,500 కోట్ల నిర్మా గ్రూప్ యాజమానిగా ఎదిగారు. ‘కె.కె.పటేల్’గా ప్రసిద్ధుడైన కర్సన్ భాయ్ ఖోడిదాస్ పటేల్ సంపన్న కుటుంబంలో జన్మించలేదు. ఆయన విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఆత్మ విశ్వాసమే అతనికి దారి చూపింది. విజయపథాన్ని చూపింది. గుజరాత్‌లోని రుపూర్లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు కె.కె.పటేల్. బీయస్సీ పూర్తయిన వెంటనే అహ్మదాబాద్‌లోని ఒక కాటన్ మిల్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రప్రభుత్వ ‘జియాలజీ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్’లో పని చేశారు. ఆఫీస్ పని పూర్తయిన తరువాత... డిటర్జెంట్ పౌడర్‌ను ప్యాక్ చేసి సైకిల్ మీద ఇంటింటికీ తిరిగి అమ్మేవారు. మార్కెట్లోని లీడింగ్ డిటర్జెంట్ పౌడర్ల కంటే పటేల్ హ్యాండ్‌మేడ్ డిటర్జెంట్ ప్యాకెట్లు తక్కువ ధరకు లభించడంతో తక్షణ విజయాన్ని సాధించాయి. ఇక అప్పుడు తన డిటర్జెంట్ పౌడర్‌కు ‘నిర్మా’ అని పేరు పెట్టారు. మూడు సంవత్సరాల తరువాత ఆయన ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉద్యోగాన్ని వదిలేశారు. అహ్మదాబాద్ శివార్లలో చిన్న వర్క్‌షాప్ ఒకటి మొదలుపెట్టారు. తన టార్గెట్ గ్రూప్ ఏమిటి అనే దాని మీద మొదట ఒక అవగాహనకు వచ్చారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి... తన టార్గెట్ గ్రూప్. ఇప్పుడు వారికి చేరువ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ‘నిర్మా’ బ్రాండ్ అనతి కాలంలోనే గుజరాత్ నుంచి మహారాష్ట్రకు విస్తరించింది. ‘ఎక్కువ నాణ్యత... తక్కువ ధర’ సూత్రంతో డిటర్జెంట్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సాధించారు కె.కె.పటేల్. వ్యాపార ప్రకటనలతో గృహిణులకు మరింత చేరువైంది నిర్మా. ఒక దశాబ్దకాలంలోనే దేశంలో ‘లార్జెస్ట్ సెల్లింగ్ డిటర్జెంట్’గా నిలిచింది. డిటర్జెంట్ పౌడర్‌తో పాటు టాయిలెట్ సోప్‌లు, బాత్, బ్యూటీ సోప్‌ల ఉత్పత్తి మొదలుపెట్టింది. ఇరుగు పొరుగు దేశాల్లో కూడా ‘నిర్మా’కు మంచి పేరు వచ్చింది. 1995లో విద్యారంగంలోకి కూడా ప్రవేశించారు కె.కె.పటేల్. అహ్మదాబాద్‌లో ‘నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ని, 2003లో ‘నిర్మా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ని స్థాపించారు. ఒక్కరితో ప్రారంభమైంది నిర్మా... ఇప్పుడు ఆ గ్రూప్ కంపెనీలలో 14,000 మంది పనిచేస్తున్నారు. అతడే ఒక సైన్యం అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం... కె.కె.పటేల్. కొందరు వెళుతున్న దారిలోనే వెళతారు. వారికి ఇంకేమీ పట్టదు. కొందరు వెళుతున్న దారిలో వెళుతూనే కొత్త దారుల గురించి ఆలోచిస్తారు. అన్వేషిస్తారు. కె.కె.పటేల్ ఈ కోవకు చెందిన వ్యక్తి. విజయానికి కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు అద్దంలా నిలిచిన వ్యక్తి. ‘నిర్మా’ వ్యాపార ప్రకటన ‘వాషింగ్ పౌడర్ నిర్మా... వాషింగ్ పౌడర్ నిర్మా’ అందరికీ సుపరిచితమే. ఇది 1975లో తొలిసారిగా రేడియోలో, 1982లో టీవిలో ప్రసారమైంది. ‘మనీ-బ్యాక్ గ్యారెంటీ’ అనేది అప్పుడు ఇప్పుడూ కంపెనీ విజయ సూత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2010లో కె.కె.పటేల్‌కు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ‘రిచెస్ట్ పర్సన్స్’ జాబితాలో పటేల్ పేరు చోటుచేసుకుంది. లో ప్రొఫైల్‌లో ఉండడానికే పటేల్ ఎక్కువగా ఇష్టపడతారు. అరుదుగా మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారు. -
కార్పొరేట్ వదాన్యుడు
మన దిగ్గజాలు సబ్బుల నుంచి సాఫ్ట్వేర్ రంగం వరకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యానికి రారాజు ఆయన. వ్యాపారవేత్తగా ఆయన సాధించిన విజయాలు మాత్రమే కాదు, వితరణశీలిగా ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు కూడా ఆయన ఔన్నత్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. భారత ఐటీ రంగంలో మకుటం లేని మహారాజుగా గుర్తింపు పొందిన అజీమ్ ప్రేమ్‌జీ దేశప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యుడు. ఐటీ రంగంలో భారత్ సాధించిన పురోగతిలో ఆయన పాత్ర కీలకం. వేల కోట్ల ఆస్తులు ఉన్నా, ‘విప్రో’ సంస్థల్లో సింహభాగం వాటాలు ఉన్నా, ఇదంతా సమాజం నుంచి తనకు దక్కిందేనని, సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే తనకు సంతృప్తి ఉందని అంటారు అజీమ్ ప్రేమ్‌జీ. అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ 1945 జూలై 24న మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా అమల్నేర్ పట్టణంలో పుట్టారు. తండ్రి మహమ్మద్ ప్రేమ్‌జీ వ్యాపారవేత్త. బియ్యం వ్యాపారంలో ఆరితేరిన ఆయన ‘రైస్ కింగ్ ఆఫ్ బర్మా’గా పేరుపొందారు. అజీమ్ పుట్టిన కొద్ది నెలల్లోనే ఆయన ‘వెస్టర్న్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్ లిమిటెడ్’ కంపెనీని ప్రారంభించారు. తర్వాతి కాలంలో ఇదే ‘విప్రో’గా రూపాంతరం చెందింది. తొలినాళ్లలో ఈ కంపెనీ ముంబైలో కర్మాగారాన్ని ఏర్పరచుకుని, శాకాహార నూనెలను, రిఫైన్డ్ నూనెలను ఉత్పత్తి చేసేది. కొంతకాలం తర్వాత వనస్పతి, డిటర్జెంట్ సోప్‌ల తయారీ కూడా ప్రారంభించింది. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వచ్చేయాల్సిందిగా మహమ్మద్ ప్రేమ్‌జీని జిన్నా ఆహ్వానించారు. అయితే, ఆయన సున్నితంగా తోసిపుచ్చి, భారత్‌లోనే ఉండిపోయారు. ఒకవైపు వ్యాపార విస్తరణను కొనసాగిస్తూనే, కొడుకు అజీమ్‌ను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపారు. స్టాన్ఫోర్డ్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు అజీమ్. అయితే, 1966లో మహమ్మద్ ప్రేమ్‌జీ ఆకస్మికంగా మరణించారు. తండ్రి మరణంతో అజీమ్ చదువును అర్ధంతరంగానే వదిలేసి భారత్‌కు రావాల్సి వచ్చింది. ‘విప్రో’ విస్తరణ పర్వం తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా ‘విప్రో’ పగ్గాలు చేపట్టారు అజీమ్. అప్పటికి ఆయన వయస్సు కేవలం 21 ఏళ్లే. స్వతహాగా తెలివైన అజీమ్ త్వరగానే వ్యాపార మెలకువలను ఆకళింపు చేసుకున్నారు. ‘విప్రో’ విస్తరణను వేగవంతం చేశారు. సబ్బులు, షాంపూలు, బేబీ ప్రోడక్ట్స్, బల్బులు వంటి వాటి ఉత్పత్తి మొదలుపెట్టారు. అనతికాలంలోనే ‘విప్రో’ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నాయి. ఇలా సాగుతుండగా, 1980లలో దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేయడం మొదలైంది. ఈ తరుణంలోనే ‘విప్రో’ ఐటీ రంగంలోనూ అడుగు పెట్టింది. అమెరికన్ కంపెనీ ‘సెంటినెల్’తో ఒప్పందం కుదుర్చుకుని కంప్యూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో, అజీమ్ ప్రేమ్‌జీ తన దృష్టిని ఎక్కువగా సాఫ్ట్వేర్ అభివృద్ధిపై సారించారు. ఐటీ రంగంలో ‘విప్రో’ ఘనవిజయాలతో రెండు దశాబ్దాలు గడిచేలోగానే దేశంలోని అపర కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు. ఈ ప్రస్థానంలో అజీమ్ ప్రేమ్‌జీని ‘పద్మవిభూషణ్’ సహా లెక్కలేనన్ని పురస్కారాలు వరించాయి. పలు వర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. ఇవ్వడంలోనే సంతృప్తి వేల కోట్ల ఆస్తులు ఉన్నా, ‘విప్రో’ సంస్థల్లో సింహభాగం వాటాలు ఉన్నా, ఇదంతా సమాజం నుంచి తనకు దక్కిందేనని, సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే తనకు సంతృప్తి ఉందని అంటారు అజీమ్ ప్రేమ్‌జీ. ఏదో మాట వరుసకు అలా అనడం కాదు, వివిధ సేవా కార్యక్రమాలకు విరివిగా ఖర్చు చేయడం ద్వారా తాను చేతల మనిషినని నిరూపించుకుంటున్నారు ఆయన. సేవా కార్యక్రమాల కోసం 2001లో ‘అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్’ను స్థాపించారు. కర్ణాటక శాసనసభ చట్టం కింద బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీని కూడా నెలకొల్పారు. పాశ్చాత్య వ్యాపార దిగ్గజాలు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ మొదలుపెట్టిన ‘ది గివింగ్ ప్లెడ్జ్’పై సంతకం చేసిన తొలి భారతీయుడు అజీమ్ ప్రేమ్‌జీనే కావడం విశేషం. ఇందులో భాగంగానే ఆయన సేవా కార్యక్రమాల కోసం తన వ్యక్తిగత సంపదలో 25 శాతం మొత్తాన్ని ఇచ్చేశారు. 2018 నాటికి మరో 25 శాతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కార్పొరేట్ ప్రపంచంలో సంపాదించడం ఒక్కటే లక్ష్యం కాదని, సంపాదించిన సంపాదనను సామాజిక ప్రయోజనాల కోసం ఖర్చుపెట్టడం కూడా అవసరమని తన చర్యలతో చాటి చెబుతున్న అజీమ్ ప్రేమ్‌జీ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తారు.