'నిర్మ'ల విజయుడు! | Washing Powder Nirma owner as Karsanbhai Patel | Sakshi
Sakshi News home page

'నిర్మ'ల విజయుడు!

Published Sun, Jul 10 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

'నిర్మ'ల విజయుడు!

'నిర్మ'ల విజయుడు!

మన దిగ్గజాలు
విజయానికి కావల్సింది ఏమిటి?
 విజయం గురించి ఆలోచించడం.
 కె.కె.పటేల్ అదే చేశారు.
 అక్కడితో ఆగిపోలేదు. ఆలోచనను ఆచరణలోకి తెచ్చారు. ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ యజమానిగా అతి పెద్ద విజయాన్ని సాధించారు...
 బహుళజాతి కంపెనీలను చూసి మామూలుగానైతే చిన్న కంపెనీలు భయపడతాయి. వాటి నడక తడబడుతుంది. కొన్నిసార్లు వాటి ఉనికి కూడా లేకుండా పోతుంది.
 అన్ని సందర్భాల్లోనూ ఇదే నిజం కాకపోవచ్చు అని చెప్పుకోవడానికి ‘నిర్మా వాషింగ్ పౌడర్’ ఒక తిరుగు లేని ఉదాహరణ.
 
డెబ్బైలలో డిటర్జెంట్ మార్కెట్‌లో ‘సర్ఫ్’... మొదలైనవి రాజ్యం ఏలుతున్న కాలం. బరిలోకి దిగడానికి కూడా ఇతరులు భయపడే కాలం. అలాంటి కాలంలో ఒకే ఒక్కడుగా డిటర్జెంట్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి అపూర్వ విజయాన్ని సాధించారు కర్సన్ భాయ్ పటేల్.
 ఒకప్పుడు ఇంటింటికీ తిరిగి డిటర్జెంట్ పౌడర్ అమ్మిన కర్సన్ భాయ్... ఇంతింతై వటుడింతై అన్నట్లుగా... ఈరోజు 2,500 కోట్ల నిర్మా గ్రూప్ యాజమానిగా ఎదిగారు. ‘కె.కె.పటేల్’గా ప్రసిద్ధుడైన కర్సన్ భాయ్ ఖోడిదాస్ పటేల్ సంపన్న కుటుంబంలో జన్మించలేదు. ఆయన విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు.
 
ఆత్మ విశ్వాసమే అతనికి దారి చూపింది. విజయపథాన్ని చూపింది.
 గుజరాత్‌లోని రుపూర్‌లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు కె.కె.పటేల్. బీయస్సీ పూర్తయిన వెంటనే అహ్మదాబాద్‌లోని ఒక కాటన్ మిల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రప్రభుత్వ ‘జియాలజీ అండ్ మైనింగ్ డిపార్ట్‌మెంట్’లో పని చేశారు. ఆఫీస్ పని పూర్తయిన తరువాత... డిటర్జెంట్ పౌడర్‌ను ప్యాక్ చేసి సైకిల్ మీద ఇంటింటికీ తిరిగి అమ్మేవారు.
 మార్కెట్‌లోని లీడింగ్ డిటర్జెంట్ పౌడర్‌ల కంటే పటేల్ హ్యాండ్‌మేడ్ డిటర్జెంట్ ప్యాకెట్లు తక్కువ ధరకు లభించడంతో తక్షణ విజయాన్ని సాధించాయి. ఇక అప్పుడు తన డిటర్జెంట్ పౌడర్‌కు ‘నిర్మా’ అని పేరు పెట్టారు.
 
మూడు సంవత్సరాల తరువాత ఆయన ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉద్యోగాన్ని వదిలేశారు. అహ్మదాబాద్ శివార్లలో చిన్న వర్క్‌షాప్ ఒకటి మొదలుపెట్టారు.
 తన టార్గెట్ గ్రూప్ ఏమిటి అనే దాని మీద మొదట ఒక అవగాహనకు వచ్చారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి... తన టార్గెట్ గ్రూప్. ఇప్పుడు వారికి చేరువ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
 ‘నిర్మా’ బ్రాండ్ అనతి కాలంలోనే గుజరాత్ నుంచి మహారాష్ట్రకు విస్తరించింది.
 
‘ఎక్కువ నాణ్యత... తక్కువ ధర’ సూత్రంతో డిటర్జెంట్ మార్కెట్‌లో తిరుగులేని విజయాన్ని సాధించారు కె.కె.పటేల్. వ్యాపార ప్రకటనలతో గృహిణులకు మరింత చేరువైంది నిర్మా. ఒక దశాబ్దకాలంలోనే దేశంలో ‘లార్జెస్ట్ సెల్లింగ్ డిటర్జెంట్’గా నిలిచింది.
 డిటర్జెంట్ పౌడర్‌తో పాటు టాయిలెట్ సోప్‌లు, బాత్, బ్యూటీ సోప్‌ల ఉత్పత్తి మొదలుపెట్టింది. ఇరుగు పొరుగు దేశాల్లో కూడా ‘నిర్మా’కు మంచి పేరు వచ్చింది.
 
1995లో విద్యారంగంలోకి కూడా ప్రవేశించారు కె.కె.పటేల్. అహ్మదాబాద్‌లో ‘నిర్మా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ని, 2003లో ‘నిర్మా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ని స్థాపించారు.
 ఒక్కరితో ప్రారంభమైంది నిర్మా... ఇప్పుడు ఆ గ్రూప్ కంపెనీలలో 14,000 మంది పనిచేస్తున్నారు.
 అతడే ఒక సైన్యం అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం... కె.కె.పటేల్.
 కొందరు వెళుతున్న దారిలోనే వెళతారు. వారికి ఇంకేమీ పట్టదు.
 కొందరు వెళుతున్న దారిలో వెళుతూనే కొత్త దారుల గురించి ఆలోచిస్తారు. అన్వేషిస్తారు. కె.కె.పటేల్ ఈ కోవకు చెందిన వ్యక్తి. విజయానికి కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు అద్దంలా నిలిచిన వ్యక్తి.
 
 ‘నిర్మా’ వ్యాపార ప్రకటన ‘వాషింగ్ పౌడర్ నిర్మా... వాషింగ్ పౌడర్ నిర్మా’ అందరికీ సుపరిచితమే. ఇది 1975లో తొలిసారిగా రేడియోలో, 1982లో టీవిలో ప్రసారమైంది.
     ‘మనీ-బ్యాక్ గ్యారెంటీ’ అనేది అప్పుడు ఇప్పుడూ కంపెనీ విజయ సూత్రాల్లో ఒకటిగా నిలిచింది.
     2010లో కె.కె.పటేల్‌కు పద్మశ్రీ పురస్కారం వచ్చింది.
     ఫోర్బ్స్ మ్యాగజైన్ ‘రిచెస్ట్ పర్సన్స్’ జాబితాలో పటేల్ పేరు చోటుచేసుకుంది.
     లో ప్రొఫైల్‌లో ఉండడానికే పటేల్ ఎక్కువగా ఇష్టపడతారు. అరుదుగా మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement