న్యూఢిల్లీ: విజేతల కథనాలు ఎవరికైనా సరే శక్తివంతమైన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అడ్డంకులను అధిగమించడానికి, లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రేరణ కల్పిస్తాయి. కష్టపడి పనిచేయడమే విజయం వెనుకనున్న రహస్యం అని అవగతమయ్యేలా చేస్తాయి. యూపీఎస్‌సీలో ఉత్తీర్ణత సాధించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఒక యువకుడు కోటి రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకున్నాడు. పట్టుదలగా చదివి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)ను సాధించాడు.
కనిష్క్ కటారియాది రాజస్థాన్‌లోని జైపూర్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయి నుండి కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యారు. అనంతరం అతనికి దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్ కంపెనీలో కోటి రూపాయల జీతంతో ఉద్యోగానికి ఆఫర్ వచ్చింది. వెంటనే ఆయన ఆ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేరారు. కొన్నేళ్ల తర్వాత కనిష్క్ భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరులో ఉన్న ఒక అమెరికన్ స్టార్టప్‌లో చేరారు. ఆ ఉద్యోగంలో అధిక జీతం వస్తున్నప్పటికీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)లో చేరాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు ఉద్యోగాన్ని వదిలి జైపూర్‌కు తిరిగి వచ్చాడు.
తరువాత రాజధాని ఢిల్లీకి చేరుకుని యూపీఎస్‌సీ పరీక్షకు కోచింగ్ తీసుకున్నాడు. తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. గణితాన్ని తన ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ఎంచుకుని పరీక్షలో విజయం సాధించారు. కనిష్క్ రాత పరీక్షలో 942 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్‌లో 179 మార్కులు సాధించారు. మొత్తం మీద 2025 మార్కులకు గాను 1,121 మార్కులు దక్కించుకున్నారు.
రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అతని తండ్రి సన్వర్ మల్ వర్మ నుండి కనిష్క్ ప్రేరణ పొందారు. తండి అడుగుజాడల్లో నడుస్తూ తన కలను సాకారం చేసుకున్నారు. కనిష్క్ కటారియా రాజస్థాన్ ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ (డీఓపీ)లో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి; లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ
Comments
Please login to add a commentAdd a comment