జాతీయవాద వ్యాపారవేత్త కస్తూర్‌భాయ్ లాల్‌భాయ్
మన దిగ్గజాలు
వ్యాపారం చేయడం ఆషామాషీ కాదు. అందునా ముక్కుపచ్చలారని పదిహేడేళ్ల కుర్రాడు నష్టాల్లో ఉన్న సంస్థను గాడిలో పెట్టి లాభాలబాట పట్టించడం అంత తేలికేమీ కాదు. విదేశీయుల పాలన కొనసాగుతున్న కాలంలో స్వదేశాభిమానాన్ని, స్వాభిమానాన్ని వదులుకోకుండానే ఈ ఘనతను సాధించారు కస్తూర్‌భాయ్ లాల్‌భాయ్. మన దేశం గర్వించదగ్గ తొలితరం పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యులుగా ఎన్నదగిన అతి కొద్దిమందిలో కస్తూర్‌భాయ్ కూడా ఒకరు. గుజరాత్‌లోని జవేరీవాడ్‌లో 1894 డిసెంబర్ 19న సంప్రదాయ జైన కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లాల్‌భాయ్ దళపత్‌భాయ్, తల్లి మోహిని.
కస్తూర్‌భాయ్ పూర్వీకులు మొఘల్, బ్రిటిష్ పాలకుల హయాంలో అహ్మదాబాద్ నగరానికి కొత్వాల్‌లుగా పనిచేసేవారు. వారి వంశంలో తొలిసారిగా కస్తూర్‌భాయ్ తాత బాగ్‌భాయ్ వ్యాపారరంగంలోకి అడుగుపెట్టారు. ఆయన వస్త్రవ్యాపారం చేసేవారు. కస్తూర్‌భాయ్ తండ్రి లాల్‌భాయ్ దళపత్‌భాయ్ 1896లో సరస్‌పూర్ కాటన్ మిల్లును స్థాపించారు. కస్తూర్‌భాయ్ విద్యాభ్యాసం అహ్మదాబాద్‌లో సాగింది. పదిహేడో ఏట కాలేజీలో చేరిన మొదటి ఏడాదిలోనే తండ్రి లాల్‌భాయ్ మరణించారు. చదువు మానేయాల్సి వచ్చింది. ఆస్తి పంపకాల్లో భాగంగా కస్తూర్‌భాయ్ వాటాకు రాయ్‌పూర్ మిల్లు వచ్చింది.
కార్మికులతో సమానంగా...
రాయ్‌పూర్ మిల్లు కస్తూర్‌భాయ్ చేతికి వచ్చేనాటికి మిల్లు నష్టాల్లో ఉండేది. పరిస్థితిని చక్కదిద్దడానికి కస్తూర్‌భాయ్ అహరహం మిల్లు అభివృద్ధికి పాటుపడ్డారు. కార్మికులతో సమానంగా కష్టపడ్డారు. వాళ్లతో కలిసే భోంచేసేవారు. కలిసే నిద్రపోయేవారు. అనతికాలంలోనే మిల్లులోని అన్ని విభాగాలపైనా పట్టు సాధించారు. ఆయన తమలో ఒకడిలా పనిచేయడంతో కార్మికుల్లోనూ ఉత్సాహం ఇనుమడించింది. క్రమంగా మిల్లు లాభాలబాట పట్టింది. రాయపూర్ మిల్లు అనుభవం ఉజ్వలమైన ఆయన భవితవ్యానికి పునాది వేసింది.
ఆయన శ్రమ వృథా కాలేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఉత్పత్తులకు విపరీతంగా పెరిగిన గిరాకీని అందిపుచ్చుకున్న కొద్దిమంది తొలితరం పారిశ్రామికవేత్తల్లో కస్తూర్‌బాయ్ కూడా ఉన్నారు. రాయ్‌పూర్ మిల్లుకు బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్‌లో ఒకరిగా 1918లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకే సొంతగా అశోకా మిల్స్‌ను స్థాపించారు. సన్నిహితుడైన దయాభాయ్ మోతీలాల్ పటేల్‌ను అశోకా మిల్స్ జనరల్ మేనేజర్‌గా నియమించుకున్నారు. దయాభాయ్ సలహాలతో సోదరులను భాగస్వాములుగా చేసుకుని, వ్యాపారాలను శరవేగంగా విస్తరించారు.
1924-38 కాలంలో నాలుగు మిల్లులను స్థాపించారు. వాటిని ఎప్పటికప్పుడు కొత్త కొత్త యంత్రాలతో ఆధునికీకరించేవారు. అప్పట్లో దేశంలోని మొత్తం స్పిన్నింగ్ పరిశ్రమలో కస్తూర్‌భాయ్ ఒక్కరిదే 12 శాతం వాటా అంటే ఆయన విస్తరణ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవాల్సిందే! అమెరికన్ కంపెనీ ‘సైనమిడ్’ సహకారంతో 1952లో దేశంలోనే తొలిసారిగా అధునాతన అద్దకం సంస్థ ‘అతుల్ లిమిటెడ్’ను స్థాపించారు.
స్వదేశీ ఉద్యమానికి బాసట
బ్రిటిష్ హయాంలో కస్తూర్‌భాయ్ 1923లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ పదవిలో కొనసాగిన మూడేళ్లలోనూ దేశంలోని పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశారు. గాంధీజీ 1930లో స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆయనకు బాసటగా నిలిచారు. అప్పట్లో దేశం ద్రవ్యోల్బణంతో అల్లాడేది. అలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలపై పన్నుల భారం తగ్గించేలా బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడిగా 1934లో ఎన్నికయ్యారు.
మరుసటి ఏడాదే అహ్మదాబాద్ టెక్స్‌టైల్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రిటిష్ పాలన కొనసాగుతుండగానే 1937లో రిజర్వ్‌బ్యాంకు డెరైక్టర్‌గా నియమితుడై, ఆ పదవిలో పన్నెండేళ్లు కొనసాగారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పలు గౌరవ పదవుల్లో కొనసాగారు. అహ్మదాబాద్‌లో ఐఐఎంతో పాటు ఇస్రో, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ వంటి పలు విద్యా, పరిశోధన సంస్థలకు భూములను విరాళంగా ఇచ్చారు. అహ్మదాబాద్‌లో ఉన్నత విద్యావ్యాప్తి కోసం 1936లో అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. ఇప్పుడది అహ్మదాబాద్ వర్సిటీగా రూపుదిద్దుకుంది.
ఆర్థిక, విద్యా, సేవారంగాలలో కస్తూర్‌భాయ్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1969లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన 1960లోనే తన వ్యాపారాలను ఇద్దరు కుమారులకు అప్పగించేసి, తర్వాతి కాలమంతా సేవారంగానికి అంకితమయ్యారు. జాతీయవాదానికి, వ్యాపార దక్షతకు, వదాన్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కస్తూర్‌భాయ్ 1980 జనవరి 20న అహ్మదాబాద్‌లో కన్నుమూశారు.
- దండేల కృష్ణ