పల్లెకు పరుగు
సాక్షి, ఖమ్మం: అధికారులు ఇక పల్లెలకు పరుగుపెట్టనున్నారు. దీంతో గ్రామాలన్నీ సందడిగా మారనున్నాయి. నవ తెలంగాణ సమాలోచనలో భాగంగా ‘మన ఊరు .. మన ప్రణాళిక’కు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని గ్రామాల అధికారులు, సిబ్బంది ఈ మార్గదర్శకాలతో గ్రామం యూనిట్‌గా వివరాలు సేకరించనున్నారు. ఈనెల 13 నుంచి ఈ ప్రక్రియ జిల్లాలోని 758 పంచాయతీల పరిధిలో ప్రారంభం కానుంది.
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం తదితర రంగాల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వివరాలు సేకరించాల్సిన ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 28 తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలి. ఈ విషయమై జిల్లా అధికారులు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం గ్రామం యూనిట్ మార్గ దర్శకాలు జారీ చేయడంతో ఈనెల 13 నుంచి క్షేత్ర స్థాయిలోకి సిబ్బందిని పంపించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల ప్రణాళిక ఈనెల 13 నుంచి 18 వరకు, మండల ప్రణాళికలు 19 నుంచి 23 వరకు, జిల్లా ప్రణాళికలు 24 నుంచి 28 వరకు నిర్వహించాలి. వివరాల సేకరణకు గ్రామ, మండల స్థాయి రిసోర్స్ పర్సన్లను కలెక్టర్ పర్యవేక్షణలో నియమిస్తారు. గ్రామ స్థాయిలో వివరాలు సేకరించి మండలానికి, మండలంలో పంచాయతీల వారీగా క్రోడీకరించి జిల్లా కేంద్రానికి పంపుతారు.
ఆ తర్వాత జిల్లా యూనిట్‌గా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. గ్రామ పంచాయతీ పేరు, కుటుంబాల సంఖ్య, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్యాలయ వివరాలు, ఇతర సంస్థలు, గ్రామ స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ ఆస్తులు, ఖర్చు, సంక్షేమం, అభివృద్ధి, విద్య, ఆవాస ప్రాధాన్యతలు.. ఇలా 14 కేటగిరీలపై అధికారులు వివరాలు సేకరించాలి. గ్రామాల్లో సభలు నిర్వహించి ఇవి రూపొందించాల్సి ఉంటుంది.
గ్రామం యూనిట్‌గా..
అన్ని అంశాల్లోనూ గ్రామం యూనిట్‌గా ప్రభుత్వం వివరాలు సేకరిస్తుంది. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వీధి దీపాలు, ఉపరితల నీటి ట్యాంకులు, చేతి పంపులు, రోడ్లు, మురుగు కాల్వలను లెక్కిస్తారు. గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల సంఖ్య, ఎంపీటీసీలు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు.. వీరి విద్యార్హత, ఈ మెయిల్ ఐడీలు, సెల్ నంబర్లను కూడా సేకరించాలని ప్రణాళిక అంశాల్లో పొందుపరిచారు.
ప్రభుత్వం గ్రామ స్థాయిలో చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు తెలియజేసే క్రమంలో గ్రామస్థాయి ప్రణాళికలో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది హోదా, విద్యార్హతలు, వేతనం ఎంతో కూడా రాయాలి. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయ వివరాలు, భవనం శిథిలావస్థలో ఉందా..?, మరుగుదొడ్లు, విస్తీర్ణం, ఎన్ని గదులు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం వివరాలు కూడా ఇందులో పేర్కొనాలి.
విద్యకు ప్రాధాన్యత..
గ్రామ స్థాయిలో ఎన్ని పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి, వాటిలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఎన్ని..?, అందులో విద్యార్థులు సంఖ్య, ఏ వయస్సు లోపు వారు ఎంతమంది అనే వివరాలను సేకరించాలి. 6-20 ఏళ్ల లోపు బడికి వెళ్లే వారు ఎంతమంది, వెళ్లని వారి సంఖ్య, ఇందులో కింది స్థాయి తరగతులు, ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థులు ఎంతమంది అనే విషయాలను సేకరించాలి. గ్రామంలో చదువు పూర్తయి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడిన వారిని గుర్తించి వారి సంఖ్య పేర్కొనాలి. అంగన్వాడీ కేంద్రాలు, పిల్లల సంఖ్య, ఆయాలు వీటి నిర్వహణ, ఎన్జీఓలు, గ్రంథాలయాలు వివరాలు కూడా సేకరించాలి.
వ్యవసాయం.. సంక్షేమం, వైద్యం..
వ్యవసాయంతో పాటు సంక్షేమ పథకాలు, వైద్యం ఎలా అందుతున్నాయనే విషయమై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామంలో వ్యవసాయ భూమి, వ్యవసాయ యోగ్యం కాని భూమి, పరపతి సంఘాలు, సహజ వనరులు, ఉపాధి ద్వారా చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు, తెలంగాణ హరిత వరణం కార్యక్రమంలో బ్లాక్‌లలో మొక్కలు నాటే కార్యక్రమం వంటి అంశాలకు ప్రభుత్వం ఈ ప్రణాళికలో ప్రాధాన్యత కల్పించింది. చెరువులు, బావులు, చెక్ డ్యాంలు, అడవుల వివరాలు కూడా ఇందులో పొందుపరచాలి.
గ్రామ ప్రణాళికలో వచ్చే అంశాల ఆధారంగా అక్కడ వ్యవసాయ పరంగా చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే గ్రామంలో ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, పింఛన్లు ఎంతమందికి అందుతున్నాయి, ఎంత మందికి ఉపాధి హామీ జాబ్‌కార్డులున్నాయి, వ్యక్తిగత మరుగుదొడ్లు, గృహాలు తదితర వివరాలు సేకరించాలి. గ్రామంలో పీహెచ్‌సీల పరిస్థితి, వైద్య సిబ్బంది, పశు వైద్యశాలలు ఎన్ని ఉన్నాయో లెక్కించాలి.
ప్రాధాన్యతగా నిధులు..
గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాసాలను మూడు విభాగాలుగా చేసి ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన రంగాలను గుర్తించాలి. వీటికి గ్రామ పంచాయతీ ద్వారా నిధులు ఎలా రాబట్టాలి, ప్రభుత్వ పరంగా ఎలా నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది అనే వివరాలతో అధికారులు చివరిగా ఆ గ్రామం అభివృద్ధికి బాటలు వేసేలా నివేదిక రూపొందించాలి. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమో ఈ ప్రణాళికతో పక్కాగా తేలిపోనుంది. ఈ ఉద్దేశంతో అధికారులు ఈ ప్రణాళికను పూర్తి చేసి పంపేందుకు చర్యలు వేగవంతం చేశారు.