సంస్కృతిని పరిరక్షించుకుందాం
ప్రొద్దుటూరు కల్చరల్:
సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రాంత ప్రముఖ్ కాకర్ల రాముడు పేర్కొన్నారు. స్థానిక వైఎంఆర్ కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో శుక్రవారం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్ ద్వారా సాంస్కృతిక విషయాల వర్క్‌షాపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతిలో మనదైన ప్రత్యేక సంస్కృతి, సంగీతం, సాహిత్యం, కళలను సజీవంగా జనజీవనంలో నింపాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు. ఏ సంస్కృతి అయినా దాని ప్రత్యేకత ద్వారా విశిష్టతను సంతరించుకుంటుందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో 6–10వ తరగతులు చదివే విద్యార్థులకు సంగీతం, నృత్యం, ఏకపాత్రభినయం, చిత్రకళ, కోలాటం, చెక్కభజన, హస్తకళలల్లో రెండురోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. 15 ప్రభుత్వ, మున్సిపల్ ప్రైవేటు పాఠశాలల 500 మందిపైగా విద్యార్థులు వర్క్‌షాప్‌లో శిక్షణ పొందుతున్నారు. సరస్వతీ విద్యామందిరం సంచాలిత సమతి అధ్యక్షుడు మునిస్వామి, విద్యాపీఠం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, కర్నూలు సంభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ శ్రీనివాసులు, సంచాలిత సమితి పట్టణ కార్యదర్శి పద్మనాభయ్య, గౌరవాధ్యక్షుడు వర్రా గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.