అస్ర తంత్ర : మంచితనం శాపంగా మారితే?
నవంబర్ నెలలో ఓ రోజు రాత్రి... నటి అమృతారావ్ కారులో ముంబై రోడ్డుమీద వెళ్తోంది. ఔట్డోర్ షూటింగు కోసం విమానం ఎక్కడానికి ఎయిర్పోర్టుకు వెళ్తోందామె. కిటికీలోంచి బయటకు చూస్తోన్న ఆమెకు ఓ దృశ్యం కనబడింది. ఓ రిక్షా కార్మికుడు తన భార్యను గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. ఆమె ఏడుస్తోంది. అది చూసి చలించిపోయింది అమృత. వెంటనే కారు ఆపి దిగింది. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి ‘ఇదేం పని’ అంటూ నిలదీస్తుండగా... మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమెను చుట్టుముట్టారు. అడ్డుకోవడానికి వచ్చిన డ్రైవర్ను కూడా నిలువరించారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. పైగా రాత్రిపూట కావడంతో వారి అరుపులు ఎవరికీ వినిపించలేదు.
ఎలాగో వారి నుంచి తప్పించుకుని కారెక్కింది అమృత. పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లయింట్ ఇద్దామంటే ఫ్లయిట్ మిస్సవుతుందని భయం. కనీసం ఫోన్ అయినా చేద్దామంటే ఇంటి దగ్గరే ఫోన్ మర్చిపోయి వచ్చింది. దాంతో చేసేదేమీ లేక ఎయిర్పోర్టుకు వెళ్లిపోయింది అమృత.
ఈ సంఘటన తనని వణికించిందని చెప్పిందామె. ‘‘మంచి చేయబోతే చెడు ఎదురయ్యింది, ఈ దేశంలో మంచిగా ఆలోచించడం కూడా తప్పే’’ అంటూ భయంగా చెప్పింది. ఆమె చెప్పింది నిజమే. కొన్నిసార్లు మనం మంచి అనుకున్నదే చెడు అవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల పాలిట ఆ మంచితనం కొన్నిసార్లు శాపమవుతుంది. ఎవరో ఒకసారి ఫోన్ ఇవ్వండి, అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి అంటే ఇచ్చేస్తారు. వాళ్లు ఆ నంబర్ సేవ్ చేసుకుని, తర్వాత వేధించడం మొదలెడతారు. ఎవరో అడ్రస్ కోసం వెతుకుతుంటే సాయం చేయాలనుకుంటారు. ఆ వ్యక్తి మెల్లగా మాట కలిిపి ‘మీరుండేది ఎక్కడ?’ అంటాడు. వీళ్లు అమాయకంగా చెప్పేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు.
ఎవరికీ సాయం చెయ్యవద్దని కాదు. చేసేముందు దానివల్ల మనకేమైనా ప్రమాదం ఉందేమో చూసుకోవాలి. అలాంటిదేమీ లేదు అనుకుంటేనే చేయాలి. మంచి మనసుండటం మంచిదే. కానీ ఆ మంచి మనకు చెడుగా మారకుండా చూసుకోవడం ఇంకా ముఖ్యం. లేదంటే అమృతలాగ మనం కూడా కొన్నిసార్లు ఆపదలో పడే ప్రమాదం లేకపోలేదు!