కాంట్రాక్ట్ ఆపరేటర్... ఉపాధి ఏపీఓనా?
ఉప్పలగుప్తం :
అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు నిబంధనలకు విరుద్ధంగా ఉప్పలగుప్తం మండలంలో ఉపాధిహామీ విభాగం అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏపీఓ)గా పనిచేస్తున్నారు. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి ఎంపీడీవో స్థాయికి సమానమైన ఏపీఓ పోస్టు అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడం లేదు. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా వేరే మండలం నుంచి ఉప్పలగుప్తం మండలానికి డిప్యుటేషపై వచ్చి పనిచేయడం గమనార్హం. మండలంలో ఏడాదికి పైగా ఉపాధి ఏపీఓ పోస్టు ఇ0చార్జిలతోనే నడుస్తోంది. కాట్రేనికోన ఏపీఓ కొంతకాలం ఇ0చార్జిగా పనిచేయగా, మండలంలోనే పని చేస్తున్న ఉపాధి ఈసీ ఎస్.కృష్ణభగవానును ఏపీఓగా నియమించారు. మూడు నెలలుగా ఈసీ భగవాను కూడా పత్తాలేరు. ఇక్కడ రిలీవ్ కాకుండానే రౌతులపూడి మండలానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. రెండు నెలలుగా ఉపాధిహామీ విభాగాన్ని నడిపించే నాథుడు లేక కిందిస్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మండలంలో ఇద్దరు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇద్దరూ కూడా ప్రమోషను జాబితాలో ఉన్నవారే. అయితే ఏపీఓగా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని నియమించవచ్చు. కాని ఇక్కడ అలా జరగలేదు. అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఎం.సీతారాంను ఏపీఓగా నియమించించారు. ఈ వారంలో ఉపాధి ఆడిట్ ప్రారంభమవుతుంది. సదరు ఆపరేటర్ మండలానికి వచ్చిన నాటి నుంచి తానొక పలుకుబడి గల వ్యక్తినని, పంచాయతీరాజ్ కమిషనర్, డ్వామా పీడీలకు బాగా కావాల్సిన మనిషినని, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు పీఏగా పని చేశానని చెప్పుకుంటున్నారు. వారి అండతోనే కాంట్రాక్ట్ ఉద్యోగికి సాధ్యం కాదని చెబుతున్న ఏపీఓ పోస్టు తనకు వచ్చిందని ఆయనే బాహాటంగా చెబుతున్నాడు. పంచాయతీరాజ్ శాఖలోని రాష్ట్రస్థాయి అధికారితో ఉన్న సన్నిహిత సంబంధాలు సీతారామ్‌కు బాగా కలిసొచ్చాయని విశ్వసనీయవర్గాల సమాచారం.