ఐక్యంగా పనిచేసినా ఫలితం రాలే!
కాంగ్రెస్ నేతల్లో మళ్లీ వలసల భయం
నేడు స్పీకర్‌ను కలవనున్న సీఎల్పీ బృందం
హైదరాబాద్: ఉపఎన్నికల ఫలితం కాంగ్రెస్ నేతలను తీవ్రంగా నిరాశపర్చింది. గతానికి భిన్నంగా పార్టీ నేతలంతా కలసికట్టుగా పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకపోవ డం వారిని అసంతృప్తికి గురిచేసింది. టీఆర్ఎస్ వంద రోజుల పాలనలో రుణమాఫీసహా ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందని, విస్తృత ప్రచారం నిర్వహించినా ఆ పార్టీకి కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో నేతలు పునరాలోచనలో పడ్డారు. ప్రభుత్వానికి కనీసం ఆరునెలల సమయమైనా ఇవ్వకుండా తొందరపడి విమర్శలు చేశామా? అనే భావన నేతల్లో కన్పిస్తోంది. ై ఏఐసీసీ దూతలు రామచంద్ర కుంతియా, కేబీ కృష్ణమూర్తి వంటి నేతలు రాష్ట్రంలోనే మకాం వేసి ఉపఎన్నికల ప్రచారాన్ని నేరుగా పర్యవేక్షించినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో తెలంగాణలో పార్టీ ఇమేజ్ను ఎలా పెంచాలో తెలియక తలపట్టుకున్నారు. మరోవైపు పార్టీ నేతల్లో మళ్లీ వలసల భయం పట్టుకుంది.
ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలతోపాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారని, తాజా ఫలితాల నేపథ్యంలో వలసల ఉధృతి మరిం త పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ దూకుడును అడ్డుకోవడానికి కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధిపై తక్షణమే అనర్హత వేటు వేయాలనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. వెంటనే శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని కలవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా బుధవారం ఉద యం 10 గంటలకు సీఎల్పీ నేత కె.జానారెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం స్పీకర్‌ను కలిసి ఇటీవల పార్టీ ఫిరాయించిన ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యపై అనర్హత వేటు వేయాలని వినతిపత్రం అందజేయనున్నారు. గతంలో పార్టీ మారిన ఆదిలాబాద్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అనర్హత పిటిషన్‌పై తొందరగా నిర్ణయం తీసుకోవాలని కూడా కోరనున్నట్టు తెలిసింది.