300మంది ఆస్ట్రేలియన్ల గల్లంతు
కాన్బెర్రా: నేపాల్‌ను నేలమట్టం చేసిన భూకంపం వేలాదిమందిని పొట్టన పెట్టుకుంది. మరోవైపు విదేశాలకు చెందిన అనేకమంది పర్యాటకులు, పర్వతారోహకులు కూడా ఈ ప్రమాదంలో అసువులు బాసిన, గల్లంతైన వార్తలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన 300మంది టూరిస్టులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల వర్గాలు అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా నుండి 549మంది టూరిస్టులు నేపాల్ వెళ్లారు. వీరిలో సుమారు 300 మంది క్షేమంగా ఉన్నదీ, లేనిదీ ఎలాంటి సమాచారం లేదు. వీరిలో సిడ్నీలోని వరల్డ్ విజన్ అనే స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ 26ఏళ్ల జేమ్స్ బ్రిన్స్సన్, అడిలైడ్‌కు చెందిన 20 సం.రాల జాచరీ ష్రెదీన్, చాట్స్వుడ్ కు చెందిన ఇసాబెల్ బాదిష్ అనే మహిళా పర్వతారోహకులు కూడా ఉన్నారు.
ఆమె నుండి మౌంటె ఎవరెస్ట్ నుండి ఏప్రిల్ 11 నుండి చివరి సారిగా ఫోన్ వచ్చిందిని కుటుంబ సభ్యుల సమాచారం. గల్లంతైన వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ భూకంప ప్రమాదంలో చనిపోయినట్టుగా భావిస్తున్న అనాథ పిల్లలకోసం పనిచేస్తున్న ఒక మహిళ తాను క్షేమంగా ఉన్న సమాచారాన్ని ఫేస్బుక్ ద్వారా అందించారు.
మరోవైపు సహాయక చర్యల కోసం నేపాల్ ప్రభుత్వానికి 30లక్షల డాలర్లను అందిస్తున్నట్టు ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి జూలీ బిషప్ సోమవారం ప్రకటించారు.