ప్రియుడిపై హత్య, హత్యాయత్నం కేసులు
సామర్లకోట : సామర్లకోటలో శుక్రవారం రాత్రి తల్లీబిడ్డలను చెరువులోకి తోసేసిన ఘటనలో నిందితుడిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్టు సీఐ కె.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. స్థానిక ఓవర్ బ్రిడ్జి సెంటర్ నుంచి దిగువ భాగంలో ఉన్న సుగర్ఫ్యాక్టరీ చెరువులోకి శుక్రవారం ఓ వివాహితను, ఆమె ఏడాది బిడ్డను ఆమె ప్రియుడు తోసివేసిన విషయం తెలిసిందే. ఘటనలో బాలుడు మృతి చెందగా, బాధితరాలు సత్యవేణి (మణి) ప్రాణాలతో బయట పడ్డారు. సత్యవేణి ఫిర్యాదు మేరకు 302, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐ చెప్పారు. ఆయన కథనం ప్రకారం కాట్రావులపల్లికి చెందిన సత్యవేణికి వేలంగికి చెందిన మడికి బాలరాజుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఏడాది క్రితం బాలరాజు సత్యవేణిని వదలి వేయడంతో బత్సల శేషుతో ఆమెకు పరిచయమైంది.
దీంతో గత మూడు నెలలుగా ఆమె అతనితో కలిసి జగ్గంపేటలో నివాసం ఉంటుంది. శేషుకు కూడా పెళ్లైంది. సత్యవేణి తనను రెండో భార్యగా ఇంటికి తీసుకువెళ్లాలని శేషును ఒత్తిడి చేస్తుండడంతో శేషు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ఆమెను ఆమె బిడ్డను ఆటోలో సామర్లకోట తీసుకొచ్చాడు. స్టేషన్ సెంటర్ నుంచి సత్యవేణిని ఆమె బిడ్డను బ్రిడ్జి మీదకు తీసుకెళ్లి అకస్మాత్తుగా వారిని చెరువులోకి తోసేశాడు. బాలుడు మృతిచెందగా, సత్యవేణి ప్రాణాలతో బయటపడ్డారు. భర్త నుంచి విడి పొయే సమయంలో సత్యవేణి మూడు నెలల గర్భిణి. శనివారం ఘటన స్థలాన్ని సీఐ నాగేశ్వరరావు, ఎస్సైలు ఎం.డి.ఎం.ఆర్.ఆలీఖాన్, నాగార్జున ఇతర సిబ్బంది పరిశీలించారు. నిందితుడు శేషును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.