విదేశాల్లో భారత్–22 ఈటీఎఫ్ లిస్టింగ్: కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్(ఎక్సే్చంజ్ ట్రేడేడ్ ఫండ్)ను ఏదైనా విదేశీ స్టాక్ ఎక్సే్చంజ్‌లో లిస్టింగ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా చేయడం ద్వారా ఈ ఫండ్‌కు మరింత విలువ చేకూరుతుందని, విదేశీ నిధులను సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్–22 ఈటీఎఫ్ ద్వారా రెండు అంచెల్లో రూ.22,900 కోట్లు సమీకరించింది. విదేశీ మార్కెట్లో భారత్ –22 లిస్టింగ్ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిగాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు వెల్లడించారు. విదేశీ మార్కెట్లో లిస్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంటే, ఇన్వెస్టర్ల డిమాండ్, స్పందన తదితర అంశాలపై ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు మదింపు చేస్తాయని వివరించారు. ఆ తర్వాత ఏ దేశంలో భారత్–22 ఈటీఎఫ్‌ను లిస్ట్ చేయాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
మంచి స్పందనే వస్తుంది ...!
గత ఆర్థిక సంవత్సరంలో ఆరంభమైన భారత్–22 ఈటీఎఫ్‌లో 16 కేంద్ర ప్రభుత్వ సంస్థల, మూడు పీఎస్‌యూ బ్యాంక్‌ల, మూడు ప్రైవేట్ రంగ కంపెనీల షేర్లు ఉన్నాయి. ఈ ఈటీఎఫ్ పూర్తి వైవిధ్య భరితమైనదని, విదేశీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. భారత్–22 ఈటీఎఫ్‌లో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్జేవీఎన్ఎల్, గెయిల్, పీజీసీఐఎల్, ఎన్ఎల్సీ ఇండియా, ఐటీసీ, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్‌ల షేర్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి ఈటీఎఫ్‌లు ఇన్వెస్టర్లను రక్షణనిస్తాయని నిపుణులంటున్నారు.