గల్ఫ్‌లో భారతీయ కార్మికులకు బీమా
గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు శుభవార్త. వారికోసం కొత్తగా బీమా సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. ఎలాగోలా అప్పో సొప్పో చేసి దుబాయ్ వెళ్లి.. నాలుగు డబ్బులు సంపాదించుకుని వద్దామనుకున్న పలువురు భారతీయులు అక్కడ నానా కష్టాలు పడటం, కొందరు అనాథల్లా మరణించడం తెలిసిందే. ఇలా విదేశాలకు వలస కార్మికులుగా వెళ్లి, ఈసీఆర్ పాస్‌పోర్టులు ఉన్నవారి కోసం భారత ప్రభుత్వం ఓ సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, విదేశాల్లో పనిచేసే భారతీయులు ఎవరైనా సహజంగా గానీ, ప్రమాదవశాత్తు గానీ మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా వారికి బీమా సదుపాయం అందుతుంది. మహాత్మాగాంధీ ప్రవాసీ సురక్షా యోజన (ఎంజీపీఎస్‌వై) అనే పథకం కింద ఇలాంటి కార్మికులకు వృద్ధాప్య పింఛన్లు కూడా ఇవ్వనున్నారు. వలస కార్మికులకు సాయం చేసేందుకు ఈ పథకానికి ప్రభుత్వం కూడా తనవంతు వాటా అందిస్తోంది.
18-50 సంవత్సరాల మధ్య వయసుండి, ఈసీఆర్ (ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) పాస్‌పోర్టు కలిగి ఉన్న భారత జాతీయులు దుబాయ్‌లో తగిన వర్క్ పర్మిట్ లేదా ఉద్యోగ కాంట్రాక్టు కలిగి ఉంటే, వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులవుతారు. వాళ్లు పెన్షన్ లబ్ధి కోసం ఏడాదికి రూ. 1000-12,000 మధ్య ఆదా చేయాల్సి ఉంటుంది. అలాగే, తిరిగి వచ్చాక స్థిరపడేందుకు ఏడాదికి రూ. 4వేలు ఆదా చేయాలి. జీవిత బీమా కోసం మాత్రం ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు. దుబాయ్‌లోని భారతీయ కార్మికులకు ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సేవలు అందిస్తుంది.