బంగారం ధరలు మరింత పతనం!
న్యూఢిల్లీ : బంగారం ధరలు మరింత కుదేలయ్యాయి. శనివారం బంగారం ధరలు మరో రూ.130 పడిపోయి, 10 నెలల కనిష్టానికి నమోదయ్యాయి. దీంతో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.28,450కి దిగజారింది. అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్ కొనసాగుతుండటంతో పాటు, దేశీయ మార్కెట్లో జువెల్లరీల నుంచి డిమాండ్ రాకపోతుండటంతో బంగారం ధరలు భారీగా క్షీణిస్తున్నాయి.
అటు సిల్వర్ ధరలు కూడా రూ.600 పతనమై కేజీకి రూ.41,250గా నమోదయ్యాయి. పరిశ్రమ యూనిట్లు, కాయిన్ తయారీదారుల డిమాండ్ క్షీణించడంతో వెండి కూడా తిరోగమనంలో పడింది. ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచుతాదనే సంకేతాలతో బంగారానికి అంతర్జాతీయంగా సెంటిమెంట్ పడిపోయిందని ట్రేడర్లు పేర్కొన్నారు.
గ్లోబల్‌గా బంగారం ఒక్క ఔన్స్‌కు 0.92 శాతం దిగజారి, 1,159.60 డాలర్లుగా ఉంది. దేశీయ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం ప్యూరిటీ బంగారం ధరలు చెరో రూ. 130 పడిపోయి రూ.28,450గా, రూ.28,300గా నమోదయ్యాయి. శుక్రవారం కూడా ఈ విలువైన మెటల్ రూ.130 పడిపోయింది. అంతర్జాతీయ దెబ్బతో పాటు, దేశీయంగా బ్లాక్‌మనీ దారులపై ప్రభుత్వం ప్రకటించిన పాత నోట్ల రద్దు, బంగారంపై ఆంక్షలు ఈ ధరలకు ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే.