‘ఓవర్టైం’కు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: తయారీ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు, సులభతర వ్యాపార నిర్వహణకు వెసులుబాటు కల్పించేందుకు బుధవారం లోక్సభ అదనపు పనిగంటల(ఓవర్టైం) బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం పరిశ్రమల్లో కార్మికులు ఇక నుంచి 3 నెలల వ్యవధిలో 100 గంటలదాకా అధిక సమయం పనిచేయవచ్చు.
ఇప్పటిదాకా ఇది 50 గంటలు ఉండేది. పరిశ్రమల (సవరణ) బిల్లు-2016ను విపక్షాలు వ్యతిరేకించి, వాకౌట్ చేశాయి. అనంతరం సభ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం కార్మికులు వారానికి 60 గంటలకన్నా ఎక్కువ పనిచేయరాదు కనుక వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లదని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనలకు లోబడే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు.
దుస్తుల రంగానికి ప్రోత్సాహకాలు
పన్నుల విధానం సవరణ బిల్లు 2016నూ లోక్సభ ఆమోదించింది. బిల్లు దుస్తుల రంగానికి పన్ను ప్రోత్సాహాకాల్ని కల్పించనుంది. నల్లరాయి(గ్రానైట్), చలువ రాయి (మార్బుల్)పై కస్టమ్స్ సుంకాన్ని 10 నుంచి 40 శాతానికి పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
ఆ బాధితులకు 3 నెలల సెలవు
లైంగిక వేధింపులకు గురైన మహిళా ఉద్యోగులకు విచారణ కాలంలో మూడు నెలలపాటు సెలవు తీసుకోవచ్చని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్సభకు వివరించారు. లైంగిక వేధింపుల ఫిర్యాదులకు సంబంధించి కేంద్రం ఎటువంటి కేంద్రీకృత సమాచార వ్యవస్థను నిర్వహించడంలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.