సొంత అఫిడవిట్లు చాలు
కేంద్రం నిర్ణయం పౌరులకు భారీ ఉపశమనం
న్యూఢిల్లీ: వివిధరకాల డాక్యుమెంట్లకు సంబంధించి పౌరులు ఇకపై సొంత అఫిడవిట్లు ఇస్తే చాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గెజిటెడ్ అధికారుల నుంచి, నోటరీల నుంచి అఫిడవిట్లు సమర్పించాల్సిన బాధ ప్రజలకు తప్పనుంది. ఆయా పనుల నిమిత్తం వ్యక్తుల నుంచి ఇకపై సొంత అఫిడవిట్లు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమాచారం పంపించింది. ప్రస్తుతం అమలులో అఫిడవిట్ల విధానాన్ని సమీక్షించి ఎక్కడ అవసరమైతే అక్కడ సొంత అఫిడవిట్ల విధానం ప్రవేశపెట్టాలని సూచించింది. ఇప్పటిదాకా వివిధ రకాల డాక్యుమెంట్లతోపాటు, నోటరీ, గెజిటెడ్ ఆఫీసర్లనుంచి అఫిడవిట్లను పౌరులు సమర్పించాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సొంత అఫిడవిట్లతోనే సరిపెట్టాలని కేంద్రం పేర్కొందని పాలనాసంస్కరణల విభాగం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
అఫిడవిట్లు తీసుకోవాలంటే ప్రజలు కనీసం రూ. వంద నుంచి రూ.150 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి రూ. 10, రూ.20 స్టాంప్ పేపర్లు దొరకక రూ. 50, రూ. 100 పేపర్లపై అఫిడవిట్లు సమర్పించాల్సి వస్తోంది. గ్రామీణుల అవస్థలైతే వర్ణనాతీతం. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ ఇక్కట్లు తప్పనున్నాయి. పాలనా సంస్కరణలు ప్రజానుకూలంగా ఉండాలన్న రెండవ పాలనా సంస్కరణల కమిషన్ సిఫారసులకనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు. మార్కుల మెమోలు, పుట్టినతేదీ సర్టిఫికెట్లవంటి వాటికి సొంత అఫిడవిట్లు సరిపోతాయన్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్లను తుదిదశలో సమర్పిస్తే సరిపోతుందన్నారు.