భూమిపై మానవ మనుగడ మరో వెయ్యేళ్లే: స్టీఫెన్ హాకింగ్
లండన్: భూగోళంపై మానవ జాతి మనుగడ వెయ్యి ఏళ్ల నుంచి పదివేల ఏళ్ల మధ్య ముగిసిపోతుందని ప్రపంచ ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. అయినంత మాత్రాన మానవ జాతి నశించి పోదని, మరో ఉపగ్రహంపై కాలనీలు ఏర్పాటు చేసుకొని మనుగడ సాగించగలదని ఆయన చెప్పారు. అయితే ఇతర గ్రహాలపై మానవులు నివాస పరిస్థితులు ఏర్పార్చుకోవడానికి ఇంకా వందేళ్లకుపైగా పట్టవచ్చని అన్నారు. ఈలోగా రానున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై దృష్టిని కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు.
భూగోళంపై మానవ మనుగడ నశించి పోవడానికి సాంకేతికరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులే వినాశనానికి దారితీయవచ్చని స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. ఆర్టిఫిషల్ బ్రెయిన్ సాంకేతిక పరిజ్ఞానం ఆధిపత్యం వల్ల భూమి మీద మానవ మనుగడకు ముప్పు ఏర్పడవచ్చని ఆయన గతేడాదే చెప్పిన విషయం తెల్సిందే. అణు యుద్ధం వల్లగానీ, భూతాపోన్నతి కారణంగాగానీ, వివిధ వైరస్లలో జన్యుమార్పిడి కారణంగాగానీ భూగోళంపై మానవ మనుగడ సాధ్యం కాకుండా పోతుందని ఆయన తాజాగా చెప్పారు. ఆటోమేషన్ ఆయుధాలు కూడా భవిష్యత్ కలష్నికోవ్ ఆయుధాలుగా మారవచ్చన్నారు. మనకన్నా అన్నింటా ముందుండే గ్రహాంతర వాసుల వల్ల కూడా ముప్పు వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు.
అమెరికాను కొలంబస్ కనుగొన్నప్పుడు అమెరికా స్థానికులకు సంభవించిన లాంటి పరిస్థితులే గ్రహాంతర వాసుల వల్ల మనకూ కలగవచ్చన్నది ఆయన అభిప్రాయం. గ్రహాంతరవాసులు కచ్చితంగా ఉంటారని విశ్వసించే స్టీఫెన్ హాకింగ్ ప్రస్తుతం వారిని కనుగొనే ప్రయత్నాల్లోనే ఉన్నారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రపంచంలోకెల్లా రెండు అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌ల ద్వారా ఆయన గ్రహాంతరవాసులను వెతుకుతున్నారు.
ఇటీవలనే 74వ ఏట ప్రవేశించిన స్టీఫెన్ హాకింగ్‌ను వార్శిక రీత్ స్నాతకోత్సవం కోసం బీబీసి ఆయన ఉపన్యాసాన్ని రికార్డు చేసింది. ఈ నెల 26వ తేదీన బీబీసీ రేడియో-4లో ప్రసారమయ్యే ఈ ఉపన్యాసంలోనివే ఆయన వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు. ఇక ప్రపంచంలో ‘యురేకా’ అంటూ కనుగొనే అంశాలు ఏమీ ఉండవని, ఇప్పటికే కనుగొన్న శాస్త్ర విజ్ఞాన మూల సూత్రాల ప్రాతిపదికనే భవిష్యత్తు పరిస్థితులను ఊహించి ఎదురయ్యే ముప్పులకు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడమే ఉత్తమ మార్గమని చెప్పారు.
కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషల్ బ్రెయిన్)కు దారితీసిన శాస్త్రవిజ్ఞాన అభివృద్ధినీ అడ్డుకోలేమని, దాన్ని తిరోగమన మార్గాన్ని పట్టించలేమని చెప్పారు. రానున్న ముప్పును ముందుగానే పసిగట్టి ఆ ముప్పుకు కారణమయ్యే పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చుకోవడం ఒక్కటే మార్గమని చెప్పారు. ఈ విశ్వాంతరాల్లో మానవులకన్నా ముందే గ్రహాంతరవాసులు ఉండే అవకాశం ఉన్నందున శాస్రవిజ్ఞాన రంగంలోనే కాకుండా ప్రజాస్వామ్య విలువలపరంగా కూడా వారు మనకన్నా ముందే ఉండే అవకాశం ఉంది. అందుకని మనకన్నా వారే ఎక్కువ హేతువాదులు కావచ్చని కూడా స్టీఫెన్ అన్నారు.