డబ్బుంటేనే డాక్టర్!
ఎంబీబీఎస్‌లో ‘బి’ కేటగిరీ ఎత్తివేతకు సర్కారు ఓకే
యాజమాన్య కోటాలో ఇక ఏటా రూ. 9 లక్షలు కట్టాల్సిందే
ఈ కేటగిరీలోని 10 శాతం సీట్ల ఫీజు రూ. 2.40 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంపు
‘ప్రైవేటు’కు రూ. 94.50 కోట్ల అదనపు లాభం.. సర్కారుకూ రూ. 25 కోట్ల మిగులు
35 శాతం యాజమాన్య కోటా సీట్లకు ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశపరీక్ష
నేడో రేపో ఉత్తర్వులు జారీచేయనున్న ప్రభుత్వం పేద విద్యార్థులకు భారీగా నష్టం
రాష్ట్రంలోని పేదలకు ఇక ముందు వైద్య విద్య మరింత దూరం కానుంది. ఏటా తొమ్మిది లక్షల రూపాయలు కట్టగలిగితేనే డాక్టర్ చదువు అందనుంది. ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం.. ‘బీ’ కేటగిరీ సీట్ల ఎత్తివేతకు ఓకే చెప్పడమే దీనికి కారణం. అంతేకాదు ఈ కేటగిరీలో ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంటు అవకాశాన్నీ సర్కారు కాలదన్నింది. తద్వారా పేదల భారాన్ని వదిలించుకుంటోంది. ప్రైవేటు వైద్య కళాశాలలకు కోట్లు సంపాదించుకునే అవకాశమిస్తూ.. సొంతంగా ప్రవేశపరీక్ష పెట్టుకోవడానికి ఓకే చెప్పింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఫీజుల పెంపు, ప్రత్యేక పరీక్షపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుంది. - సాక్షి, హైదరాబాద్
గతంలో 60 శాతం ఎంసెట్ ద్వారానే..
రాష్ట్రంలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు 15 ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లోని ‘ఏ’ కేటగిరీలో 50 శాతం (1,050) సీట్లు, ‘బీ’ కేటగిరీలో 10 శాతం (210) సీట్లను ప్రభుత్వమే ఎంసెట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసేది. మిగతా 40 శాతంలో (25 శాతం యాజమాన్య కోటా, 15 శాతం ఎన్నారై కోటా) సీట్లను ప్రైవేటు కళాశాలలే తమకు నచ్చినట్టుగా భర్తీ చేసుకొనేవి.
‘బి’ కేటగిరీకి మంగళం!
గతంలో 10% సీట్లను ‘బి’ కేటగిరీ కింద ఎంసెట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసేవారు. ఇలా సీట్లు పొందిన పేద విద్యార్థులకు ఏటా రూ. 2.40 లక్షల చొప్పున ఐదేళ్ల పాటు ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ చేసేది. కానీ ఈ 10% సీట్లను ప్రైవేటు కాలేజీలకే అప్పజెప్పడంతో పాటు ఫీజును ఏటా రూ.9 లక్షలకు పెంచారు. బీ, సీ1 కేటగిరీలను కలిపి 35% సీట్లకు ఒకే ఏకీకృత ఫీజును నిర్ధారించారు. దీంతో ప్రభుత్వ సాయంతో చదువుకునే ‘బి’ కేటగిరీ విద్యార్థులు ఇక వైద్య విద్యకు దూరమైనట్లే! ప్రభుత్వ నిర్ణయంతో పేదలు వైద్య విద్యకు అవకాశమున్న 210 సీట్లు తగ్గిపోయినట్లే. ఇక నుంచి 35% సీట్లను ‘బి’ కేటగిరీగానే పిలుస్తారు.
ఒత్తిడికి తలొగ్గిన సర్కారు..
తాజాగా ‘బీ’ కేటగిరీ సీట్లను హస్తగతం చేసుకోవడంలో ప్రైవేటు వైద్య కళాశాలలు విజయం సాధించాయి. ఈ విషయంగా ప్రైవేటు కళాశాలలు తెచ్చిన తీవ్ర ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. ఈ కేటగిరీలోని 10 శాతం సీట్లను వారికి అప్పగిస్తోంది. దీంతో ఐదేళ్లలో రూ.94.50 కోట్లను ప్రైవేటు కాలేజీలకు అప్పగించినట్లయింది.
‘ప్రైవేటు’ సీట్లు, ఫీజుల వివరాలు..
కేటగిరీ శాతం సీట్ల సంఖ్య పాత ఫీజు ప్రస్తుత ఫీజు
ఏ (కన్వీనర్) 50% 1,050 60 వేలు మారలేదు
బీ (యాజమాన్య) 10% 210 2.40 లక్షలు 9 లక్షలు
సీ1 (యాజమాన్య) 25% 525 9 లక్షలు మారలేదు
సీ2 (ఎన్నారై) 15% 315 11 లక్షలు మారలేదు
స్వచ్ఛంద సంస్థతో..
యాజమాన్య కోటాలోని ‘బి’, ‘సి1’ కేటగిరీల్లో ఉన్న 35 శాతం (735) సీట్లకు ఏకీకృత ఫీజును నిర్ణయించిన సర్కారు వాటికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అంగీకరించింది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షను ఈ ఏడాది నుంచే చేపట్టాలని నిర్ణయించింది. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు త్వరలోనే నోటిఫికేషన్ జారీచేస్తారు. అయితే పర్యవేక్షణ, అడ్మిషన్ బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుంది. అయితే ఈ బాధ్యతను ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీకి అప్పగించాలా, లేక జేఎన్టీయూహెచ్కు అప్పగించాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.