ఆ నగరాల జాబితాలో హైదరాబాద్
సాక్షి, న్యూఢిల్లీ : 2019 నుంచి 2035 మధ్య అత్యంత వేగంగా ఎదిగే టాప్ 20 నగరాల జాబితాలో 17 భారతీయ నగరాలకు చోటు దక్కింది. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వెల్లడించిన ఈ జాబితాలో సూరత్ అగ్రస్ధానంలో నిలవగా వరుసగా ఆగ్రా, బెంగళూర్, హైదరాబాద్, నాగపూర్, తిరుపూర్, రాజ్‌కోట్, తిరుచిరాపల్లి, చెన్నై, విజయవాడలు నిలిచాయి. అయితే 2035 నాటికి ఈ నగరాల మొత్తం జీడీపీ చైనా నగరాల జీడీపీతో పోల్చితే తక్కువగానే ఉంటుందని వార్షిక ప్రపంచ నగరాల పరిశోధన నివేదికలో ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ పేర్కొంది.
ఉత్తర అమెరికా, యూరప్ నగరాల కంటే అధికంగా చైనా నగరాలే 2035 నాటికి అత్యధిక ఉత్పత్తులు సమకూరుస్తాయని అంచనా వేసింది. ఇక 2018-2035 మధ్య సూరత్ 9.2 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత నగరాల జాబితాలో నెంబర్ వన్‌గా నిలిచింది. భారత్ వెలుపల కంబోడియా రాజధాని ఫెమ్ ఫన్ అత్యధికంగా 8.1 శాతం సగటు వార్షిక వృద్ధితో ఎదుగుతాయని ఈ అథ్యయనం పేర్కొంది. ఆసియా నగరాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నా 2035 నాటికి సైతం అమెరికా నగరం న్యూయార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా తన ప్రతిష్టను నిలుపుకుంటుందని అంచనా వేసింది.