చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్
హైదరాబాద్: చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తున్నట్టు నటించి రోగి బంధువుల నుంచి లక్షలు వసూలు చేసిన డాక్టర్లు... ఈ మాటలు వింటుంటే ఏదో సినిమాలో చూసినట్లు గుర్తోస్తోంది కదూ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో వ్యక్తి మరణించాడని ధ్రువీకరణ అయిన తర్వాత కూడా అతనికి వైద్యం చేసి మృతుడి కుటుంబం నుంచి రూ.3 లక్షలు వసూలు చేస్తారు వైద్యులు. అచ్చం ఇలాంటి సంఘటనే ఎల్బీనగర్ పరిధిలోని ఓజోన్ ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాజశేఖర్(35) లారీడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడు రోజుల కిందట గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అప్పటినుంచి ఓజోన్ ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులను ఐసీయూ లోకి అనుమతించకపోవడంతో అతని పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియరాలేదు. గురువారం సాయంత్రం డబ్బులు చెల్లించాల్సిందిగా ఆస్పత్రి సిబ్బంది ఒత్తిడి పెంచడంతో కుటుంబసభ్యులు రాజశేఖర్ ను చూపించాల్సిందిగా గట్టిగా కోరడంతో అతడు మృతిచెందాడని తెలిసింది.
చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంటు చేస్తున్నట్టు నటించి రూ.లక్షలు వసూలు చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. విషయం బయటకు పొక్కడంతో కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ కార్యకర్తలు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. వైద్యుల ధోరణిని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో ధర్నా విరమింప చేయడానికి యత్నిస్తున్నారు. పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు.